కవిగా, రచయితగా, మానవతా వాదిగా సమాజంపై తనదైన ముద్ర వేసిన గొప్ప సంఘ సంస్కర్త సుబ్రమణ్య భారతి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమిళ మహాకవి సుబ్రమణ్య భారతి 138వ జయంతి సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ భారతి ఉత్సవాల్లో వర్చువల్ మాధ్యమంలో ప్రధాని పాల్గొన్నారు. విడిపోయిన ఏ సమాజమైనా విజయం సాధించలేదని సుబ్రమణ్య భారతి నమ్మేవారని మోదీ తెలిపారు.
యువతరానికి స్ఫూర్తి
రాజకీయ స్వేచ్ఛలో శూన్యత ఉంటే సమాజంలోని చెడు, అసమానతలను నిర్మూలించలేమని ఆయన రాశారని ప్రధాని గుర్తు చేశారు. మహిళా సాధికారతపై సుబ్రమణ్య భారతి ప్రధానంగా దృష్టిసారించారని పేర్కొన్నారు మోదీ. మహిళలు తలెత్తుకు తిరగాలని భావించే ఆయన దూరదృష్టి నుంచి స్ఫూర్తి పొంది.. వారికి సాధికరత కల్పించేందుకు తాము పని చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు. సుబ్రమణ్య భారతి నుంచి ప్రస్తుత యువతరం కూడా ఎంతో నేర్చుకోవచ్చని ప్రధాని అభిప్రాయపడ్డారు.
"సుబ్రమణ్య భారతిని ఏదో ఒక వృత్తికి పరిమితం చేయలేం. ఆయన కవి, రచయిత, సంపాదకుడు, పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, మానవతావాది. ఆయన అంతకంటే ఎక్కువ కూడా. ఆయన రచనలు మనల్ని అద్భుతమైన భవిష్యత్తు దిశగా నడిచేందుకు మార్గదర్శనం చేసే వెలుగు వంటివి. సుబ్రమణ్య భారతి నుంచి ప్రస్తుత యువతరం చాలా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ధైర్యంగా ఎలా ఉండవచ్చన్న విషయంలో ఆయన నుంచి చాలా తెలుసుకోవచ్చు. భయం అనేది ఆయనకు తెలియని విషయం. పురాతన విధానాలు, ఆధునిక విధానాల మధ్య ఆరోగ్యకరమైన అనుసంధానం ఉండాలని ఆయన విశ్వసించేవారు. మన మూలాలతో అనుసంధానం అవుతూనే ఉజ్వల భవిష్యత్తు దిశగా దృష్టి సారించాలని ఆయన భావించేవారు."
- ప్రధాని నరేంద్ర మోదీ,