తమిళనాడులోని నీలగిరి జిల్లాలో తీవ్రగాయలపాలైన ఏనుగు.. తెప్పాకడులోని సంరక్షణ కేంద్రానికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో గురువారం చనిపోయింది. ఎడమ చెవికి కాలిన గాయాలవడం వల్ల తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు శవపరీక్షలో తెలింది. దాని శరీరం వెనుకభాగాన మరో తీవ్ర గాయం ఉందని వైద్యులు తెలిపారు. ఉపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురయ్యాయని పేర్కొన్నారు.
చెట్ల కొమ్మలను ఏనుగు విరిచేటప్పుడు గాయమై ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే చెవికి కాలిన గాయాలు ఎలా అయ్యాయో ఇంతవరకు తెలియలేదు. బహుశా ఎవరో పెట్రోల్ బాంబుతో ఏనుగుపై దాడి చేసి ఉండొచ్చని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు.
ఏనుగు చెవికి కాలిన గాయమైనట్లు గుర్తించాము. సంఘ విద్రోహశక్తులెవరన్నాపెట్రోల్ బాంబుతో ఏనుగుపై దాడి చేశారా? లేదా? అని త్వరలో తేలుతుంది. అందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. ఒక వేళ పెట్రోల్ బాంబుతో దాడిచేశారని తేలితే వారిని కఠినంగా శిక్షిస్తాం.
-శ్రీకాంత్, ముడుమలై పులుల అభయారణ్యం డైరక్టర్
తీవ్ర గాయాలపాలైన ఏనుగును అటవీశాఖ అధికారులు మలినగుడి ప్రాంతంలో గుర్తించారు. వెంటనే దానికి ప్రథమ చికిత్స చేశారు. పై అధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు ఏనుగుకు మత్తు మందు ఇచ్చి తెప్పాకడు ఏనుగుల కేంద్రానికి తీసుకు వెళుతుండగా మార్గమధ్యలో అది చనిపోయింది.
మృతి చెందిన ఏనుగుకు మాసినగుడి గ్రామస్తులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.
ఇదీ చూడండి: తమిళనాడులో ట్రక్కు ఢీకొన్న గజరాజు మృతి