ఓ వైపు లాఠీ పట్టుకుని శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే.. మరోవైపు తెల్లకోటు, మెడలో స్టెతస్కోప్ వేసుకుని ఎంతో మంది ప్రాణాలను నిలుపుతున్నారు ఓ పోలీస్ అధికారి. మాయదారి కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. మధ్యప్రదేశ్ ఇందోర్ ఎస్పీ రాజేశ్ సహాయ్.. వైద్యుడిగా మారారు. గతంలో వైద్య వృత్తిని చేపట్టిన అనుభవంతో ఇప్పుడు కరోనా బాధితులకు ఆయన చికిత్స చేస్తున్నారు.
పోలీసు అయినప్పటికీ..
రాజేశ్ సహాయ్ తొలుత ఎంబీబీఎస్, ఎండీ విద్యను పూర్తిచేశారు. ఆ తర్వాత ఓ పెద్ద ఆసుపత్రిలో ఐసీయూ ఇన్‌ఛార్జ్‌గానూ పనిచేశారు. అదే సమయంలో సివిల్స్ పరీక్ష రాసి పోలీసు డిపార్ట్‌మెంట్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన ఇందోర్ స్పెషల్ బ్రాంచ్‌లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే పోలీసు అయినప్పటికీ వైద్య వృత్తిని మర్చిపోలేదు. ఇటీవల ఇందోర్‌లో చాలా మంది పోలీసు అధికారులు కరోనా బారిన పడగా.. వారి కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాజేశ్ మళ్లీ వైద్య వృత్తిని చేపట్టారు. ఓ వైపు ఎస్పీగా విధులు నిర్వహిస్తూనే ఆసుపత్రికి వెళ్లి కరోనా సోకిన పోలీసులకు, వారి కుటుంబసభ్యులకు చికిత్స అందిస్తున్నారు.
"పోలీసు శాఖ నాకు కుటుంబం లాంటిది. ఇలాంటి విపత్కర సమయంలో కరోనా బాధితులకు నా వంతు సాయం చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పని ఏముంటుంది? కరోనా అని తెలియగానే చాలా మంది భయపడుతున్నారు. వారికి చికిత్సతో పాటు మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది"
-రాజేశ్ సహాయ్, ఇందోర్ ఎస్పీ
కరోనా విపత్తు వేళ అటు పోలీసుగా.. ఇటు డాక్టర్‌గా ప్రజలకు సేవ చేస్తున్న రాజేశ్‌ను ఉన్నతాధికారులతో పాటు పలువురు అభినందిస్తున్నారు.
ఇదీ చూడండి: 'కరోనా కట్టడికి జాతీయ విధానాన్ని రూపొందించాలి'
ఇదీ చూడండి: అమ్మ, నాన్నను కోల్పోయినా.. సేవకే ఆమె ప్రాధాన్యం