Indigo Fined For Irregularities : వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడిన కారణంగా విమానయాన సంస్థ ఇండిగో, ముంబయి విమానాశ్రయం, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్‌లపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.2.70 కోట్ల జరిమానా విధించాయి. విమానం ఆలస్యం కావడం వల్ల ముంబయి ఎయిర్‌పోర్టులో నేలపైనే ప్రయాణికులు ఆహారం తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బీసీఏఎస్, ఇండిగో సంస్థపై రూ.1.20 కోట్లు జరిమానా విధించింది. దాంతో పాటు ముంబయి ఎయిర్‌పోర్టుపై రూ.60 లక్షల ఫైన్ వేసింది. ఇదే సంఘటనకు సంబంధించి ఇండిగోపై డీజీసీఏ రూ.30 లక్షలు పెనాల్టీ వేసింది. మరోవైపు పైలట్ల రోస్టరింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎయిర్ఇండియా, స్పైస్‌జెట్ సంస్థలకు డీజీసీఏ రూ.30 లక్షలు చొప్పున జరిమానా విధించింది.
టాయిలెట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు!
ప్రయాణికుల భద్రత కోసం డీజీసీఏ, బీసీఏఎస్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. తాజాగా ముంబయి నుంచి బెంగళూరు వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడికి తీవ్ర అసౌకర్యం కలిగింది. విమానంలో మరుగుదొడ్డికి వెళ్లిన ఓ ప్రయాణికుడు అనంతరం బయటకు రాబోగా తలుపు తెరుచుకోలేదు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 'నేను లోపల చిక్కుకుపోయాను. తలుపు తెరవండి' అంటూ కేకలు వేస్తూ తలుపును బాదాడు ప్రయాణికుడు. తోటి ప్రయాణికులు గుర్తించి సిబ్బందిని పిలిచారు. వారు కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తలుపు తెరుచుకోలేదు. దీంతో 'మీరు భయపడొద్దు. కమోడ్ సీటుపై సురక్షితంగా కూర్చోండి. విమానం కిందకు దిగాక తలుపు తెరిపిస్తాం' అంటూ ఓ చీటీ రాసి, తలుపు సందులో నుంచి ప్రయాణికుడికి అందించారు విమాన సిబ్బంది.
విమానం బెంగళూరులో దిగాక ఇంజినీర్లు వచ్చి తలుపు తెరచి, ప్రయాణికుడిని బయటకు తీసుకొచ్చారు. ఇక ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి బాధ్యత వహిస్తూ బాధితుడికి ప్రయాణ ఛార్జీని వెనక్కు ఇచ్చేస్తామని స్పైస్ జెట్ సంస్థ ప్రకటించింది. ఈ ఘటనపై స్పందించిన డీజీసీఏ విచారణకు ఆదేశించింది.
విమానం కాక్‌పిట్‌లోకి స్నేహితురాలిని పిలుచుకున్న పైలట్.. 3 గంటలు పాటు..