నియంత్రణ సంస్థలు ఎన్ని ఉన్నా.. ప్రజల అలవాట్లను క్రమబద్దీకరించలేవు. అధిక మొత్తంలో మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల 2017-19 మధ్య కాలంలో దేశంలో 2,300 మంది మరణించారు. వీరిలో 30-45 ఏళ్ల వయసు వారే అధికంగా ఉండడం మరింత ఆందోళనకర అంశం.
ఆ వయసు వారే అధికం..
జాతీయ నేర గణాంకాల బ్యూరో(ఎన్సీఆర్బీ) విడుదల చేసిన సమాచారం ప్రకారం.. 2017లో 745 మంది, 2018లో 875 మంది, 2019లో 704 మంది మాదకద్రవ్యాలకు బలయ్యారు. వీరిలో (మూడేళ్లకు కలిపి చూస్తే) 30 నుంచి 45 ఏళ్ల వయసు వారు 784 మంది ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే రాజస్థాన్లో 338 మంది, కర్ణాటకలో 239 మంది, ఉత్తర్ప్రదేశ్లో 236 మంది చనిపోయారు. 14ఏళ్ల లోపు వారు 55 మంది, 14-18 ఏళ్ల వయసు వారు 70 మంది మాదకద్రవ్యాలకు బలైనట్లు ఎన్సీఆర్బీ సమాచారం తెలియజేస్తోంది.
ఖైదీల్లో 5,677 మంది టెకీలే..
దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న 4,78,600 ఖైదీల్లో 5,677 మంది టెక్నికల్ డిగ్రీలు చదివినవారని(టెకీలు), 27.37 శాతం(1,32,729) మంది ఖైదీలు నిరక్షరాస్యులని ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడించాయి. గతేడాది డిసెంబర్ 31 వరకు నవీకరించిన ఎన్సీఆర్బీ సమాచారం ఆధారంగా.. జైళ్ల గణాంకాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్రెడ్డి ఇటీవల పార్లమెంటుకు సమర్పించారు.
ఖైదీల విద్యార్హతల విషయాన్ని పరిశీలిస్తే 1,98,872(41.55శాతం) మంది పది, అంతకంటే తక్కువ చదివినవారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్లో 1,01,297 మంది ఖైదీలు ఉన్నారు. 2018, 2019కి సంబంధించి పశ్చిమబెంగాల్ ఖైదీల సమాచారాన్ని అందజేయలేదని, మహారాష్ట్ర వర్గీకరించలేదని కేంద్రం పేర్కొంది.
ఇదీ చదవండి: నేర ముఠాల ఆటకట్టించేందుకు కృత్రిమ మేధ