Precaution Dose Indians Travelling Overseas: భారత్లో ప్రికాషన్ డోసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు వెళ్లేవారు(సాధారణ పౌరులు, విద్యార్థులు) గడువు కంటే ముందుగానే టీకా తీసుకునేందుకు అనుమతి కల్పించింది. వివిధ దేశాల నిబంధనలకు అనుగుణంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది. దీని గురించి సమాచారం.. త్వరలో కొవిన్ పోర్టల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ.
సాధారణంగా.. వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత ప్రికాషన్ డోసు తీసుకోవాలని గతంలో కేంద్రం స్పష్టం చేసింది. అయితే విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోసం, ఆయా దేశాల నిబంధనలకు అనుగణంగా.. మార్గదర్శకాలను సడలించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంటే.. 9 నెలల కంటే ముందుగానే ఇప్పుడు వారు టీకా తీసుకునే వెసులుబాటు కల్పించింది.
జనవరి 10న దేశంలో మూడో డోసు(ప్రికాషన్) పంపిణీ ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ప్రికాషన్ డోసు అందించారు. అయితే ఏప్రిల్ 10 నుంచి 18 ఏళ్ల పైబడిన అందరూ ప్రికాషన్ డోసు వేయించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ప్రైవేటు కేంద్రాల ద్వారా ఈ డోసును పంపిణీ చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'ఏడాదిలోపు పిల్లల్ని కనండి లేదా రూ.5 కోట్లు ఇవ్వండి'