తామరాకు తరహాలో నీటిని వికర్షించే ఒక ఉపరితలాన్ని భారత్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది నీటి బుడగలా వికర్షిస్తుంది. బంగారు సూక్ష్మ ఆకృతులతో దీన్ని రూపొందించారు. దీని సాయంతో తేమ స్థాయిని సర్దుబాటు చేసుకోవచ్చు. అనేక రకాల బయోసెన్సార్ల అభివృద్ధిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఘన ఉపరితలాన్ని.. ఒక ద్రవం స్పృశించగలిగే సామర్థ్యాన్ని 'వెట్టబులిటీ'గా పేర్కొంటారు. చెమ్మగిల్లే ప్రక్రియను కట్టడి చేయడం వల్ల.. నీటి ప్రవాహ తీరుతెన్నులను నియత్రించడానికి, స్వయంగా శుభ్రం చేసుకునే సాధనాలను తయారు చేయడానికి వీలు కలుగుతుందని పరిశోధనలో పాలుపంచుకున్న పి. విశ్వనాథ్ పేర్కొన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టీ) శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. వీరు తయారుచేసిన ఉపరితలానికి ఆక్టాడెకేన్ థియోల్ అనే పదార్థంతో కూడిన పొరను జోడించినప్పుడు నీటి వికర్షణ సామర్థ్యం మరింత పెరిగినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదీ చదవండి : భారత సంతతి ప్రొఫెసర్‌కు అమెరికా రూ.13 కోట్ల ఫెలోషిప్