Indian military aircraft fleet: ప్రపంచంలోనే 4వ అతిపెద్ద యాక్టివ్ మిలిటరీ ఎయిర్‌క్రాప్ట్ ఫ్లీట్ ఉన్న దేశంగా.. భారత్ నిలిచింది. గతేడాది కూడా దేశం ఇదే స్థానాన్ని దక్కించుకుంది. దేశంలో త్రివిధ దళాలకు చెందిన మొత్తం 2,182 విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వివరాలను ఫ్లైట్ గ్లోబల్ అనే సంస్థ తన వార్షిక వరల్డ్ ఎయిర్‌ఫోర్స్ డైరక్టరీలో పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీ విమానాల్లో భారత్ వాటా 4శాతంగా ఉంది. ఫ్లీట్‌లో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకర్లు, ట్రాన్స్పోర్టర్లు, ట్రైనర్లు, స్పెషల్ మిషన్స్ ఉంటాయి.
Indian military aircraft list
- యుద్ధ విమానాలు(694), రవాణా విమానాలు(253), యుద్ధ హెలికాప్టర్ల(805) జాబితాలో దేశం 4వ స్థానంలో నిలబడగా.. స్పెషల్ మిషన్(71) జాబితాలో 5, ట్రైనర్స్(353) జాబితాలో 6వ స్థానాన్ని దక్కించుకుంది.
- యుద్ధ విమానాల సంఖ్యలో మాత్రం భారత్ తీవ్ర లోటును ఎదుర్కొంటోంది. దేశంలో సుఖోయ్-30(248), జాగ్వార్(130), మిగ్-21(128), మిగ్-29(65), మిరాజ్ 2000(45), తేజస్(19), రఫేల్(23) మాత్రమే ఉన్నాయి. మరో 7 రఫేల్ విమానాలు.. రిపోర్టు తయారు చేసిన తర్వాత దేశానికి చేరాయి. దీంతో మొత్తం విమానాల సంఖ్య 700కు చేరింది.
- ట్యాంకర్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. దేశంలో ఆరు ఎల్-78 ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. వాటిల్లోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ట్యాంకర్ల జాబితాలో దేశం టాప్-10లో కూడా లేదు.
ప్రపంచవ్యాప్తంగా ఇలా..
- నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 53,271 క్రియాశీల యుద్ధ విమానాలు ఉన్నాయి. అమెరికా(13,246) టాప్‌లో ఉంది. రష్యా(4,173), చైనా(3,285) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ కొరియా(1,595), జపాన్(1,449), పాకిస్థాన్(1,387).. భారత్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
- అయితే గతేడాదితో పోల్చితే.. క్రియాశీల యుద్ధ విమానాల సంఖ్య కొంత తగ్గింది. తాలిబన్ల ఆక్రమణ అనంతరం అఫ్గానిస్థాన్‌లో ఉన్న కొన్ని విమానాలు యాక్టివ్‌గా లేవని నివేదిక పేర్కొంది.
- అత్యాధునిక ఎఫ్-16 యుద్ధవిమానాలు ప్రపంచవ్యాప్తంగా 2,248 ఉన్నాయి. యుద్ధ విమానాల్లో వీటి వాటా 15శాతం. ఆ తర్వాతి స్థానాల్లో సుఖోయ్(1,063) ఉంది. భారత దేశంలో 248 సుఖోయ్ విమానాలు తిరుగుతున్నాయి.
అమెరికా యుద్ధ విమానాల సంఖ్య ఆందోళనకరంగా ఉందని నివేదిక పేర్కొంది. చైనా, రష్యా వంటి శత్రుదేశాల నుంచి ముప్పు ఎదురవుతున్నా.. అగ్రరాజ్యం శక్తిసామర్థ్యాలూ స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపింది.
ఇదీ చూడండి:- జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర వీరులకు ప్రధాని నివాళి