వాతావరణంలో మార్పుల కారణంగా మన దేశంలో భవిష్యత్తులో తీవ్రమైన పరిస్థితులు మరింతగా పెరుగుతాయని గుజరాత్‌లోని గాంధీనగర్ ఐఐటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒకపక్క వరదలు, మరోపక్క వడగాల్పులు తీవ్రమవుతాయని వారు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 1951 నుంచి 2020 మధ్య కాలాన్ని అధ్యయనం చేసిన మీదట ఈ అంచనాకు వచ్చారు. ఈ ఏడాది పాకిస్థాన్‌లో కనిపించిన తరహా పరిస్థితులు మనకూ తప్పవనీ, దానివల్ల- వ్యవసాయ దిగుబడులపై, ప్రజారోగ్యంపై, మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని హెచ్చరించింది.
ఈ అధ్యయనం వివరాలు 'వన్ ఎర్త్' పత్రికలో ప్రచురితమయ్యాయి. "వేసవిలో ఎండలు మండిపోతాయి. ఆ వెంటనే వానాకాలంలో అవే ప్రాంతాలను కుంభవృష్టి ముంచెత్తుతుంది. ఇలా తీవ్రస్థాయి మార్పులు మున్ముందు అనేకరెట్లు పెరిగిపోతాయి" అని గాంధీనగర్ ఐఐటీలో సివిల్ ఇంజినీరింగ్-భూ విజ్ఞాన శాస్త్రాల విభాగం ఆచార్యుడు విమల్ మిశ్ర చెప్పారు. ఎల్‌నినో వల్ల మహా సముద్ర జలాల ఉష్ణోగ్రతల్లో వస్తున్న మార్పులు దీనికి కారణమని తెలిపారు. పారిశ్రామిక యుగానికి ముందునాటి కంటే పుడమి ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరిగితే తీవ్రత క్రమం ఇంకా ఎక్కువవుతుందన్నారు.
ఎక్కువ రోజులు వేడిగాలులు
1981-2000 మధ్య వడగాల్పులు సగటున మూడు రోజులపాటు ఉన్నాయి. 2071-2100 మధ్య ఇది 11 రోజులకు పెరుగుతుంది. అదీ ఉద్గారాలు తగ్గితేనే. ఒకవేళ ఉద్గారాలు పెరిగిపోతే మాత్రం అవి 33 రోజులకు పెరిగిపోతాయి. అప్పుడు ప్రభావిత ప్రజల సంఖ్య కూడా అనేక రెట్లు అధికమవుతుంది. ఇతర రాష్ట్రాల కంటే ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకల్లో తరచూ విపరీత వాతావరణ పరిస్థితులు కనిపించే అవకాశాలు ఎక్కువ.