దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, డైరీ-ఫిషరీ క్రెడిట్ సొసైటీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ ఈ సొసైటీలు ఏర్పాటుకాని గ్రామాలు, పంచాయతీల్లో ఐదేళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే దేశంలో 63వేల ప్రాథమిక వ్యవసాయ క్రిడెట్ సొసైటీలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో.. 2 లక్షల సొసైటీలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్ అమలు కోసం కార్యాచరణ ప్రణాళికను నాబార్డ్, నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్, నేషనల్ ఫిషరీ డెవలప్‌మెంట్ బోర్డ్ రూపొందిస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో పాటుగా మత్స్య, పశుసంవర్ధక శాఖలను మరింత బలోపేతం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. డైరీ-ఫిషరీ క్రెడిట్ సొసైటీల ఏర్పాటు ద్వారా రైతు సభ్యులకు వారి ఉత్పత్తులకు సరైన మార్కెట్, ఆదాయాలు మెరుగుపడటం వంటి పలు ప్రయోజనాలు కలగనున్నాయి.
ఇదే సమయంలో చైనాతో ఉన్న వాస్తవాధీనరేఖ వెంబడి సైన్యం బలోపేతం కోసం కేంద్రమంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్‌కి కొత్తగా ఏడు బెటాలియన్లు మంజూరుచేసింది. ఈ 7 కొత్త బెటాలియన్లలో 9,400 మందిని నియమించనున్నారు. నూతనంగా నియమించనున్న ఐటీబీపీ సిబ్బందిని 47 కొత్త సరిహద్దు పోస్టుల్లో, 12 స్టేజింగ్ క్యాంప్‌లలో ఉపయోగించుకోనున్నారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం కింద ఉత్తర సరిహద్దుల్లోని గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం.. వైబ్రంట్ విలేజస్ ప్రోగామ్ అమలు చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022-23 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్య 4, 800 కోట్లతో ఈ పథకం అమలు చేయనున్నారు. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయలతో పాటు జీవనోపాధి అవకాశాలు పెంచడమే ఈ పథకం ఉద్దేశమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.