INDIA vs NDA Bypoll 2023 : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏను గద్దెదించాలన్న లక్ష్యంతో జట్టుకట్టిన ఇండియా కూటమి కీలక పరీక్ష ఎదుర్కోనుంది. మంగళవారం జరగనున్న ఉప ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులతో అమీతుమీ తేల్చుకోనుంది. అసెంబ్లీ ఎన్నికలే అయినప్పటికీ.. పలు స్థానాల్లో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు ఒకే అభ్యర్థిని నిలబెట్టడమో, లేదా పోటీకి దూరంగా ఉండటమో చేశాయి. మొత్తం ఏడు స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై ఎలాంటి ప్రభావం చూపకపోయినప్పటికీ.. రానున్న అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి ఉపయోగపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇండియా X ఎన్డీఏ.. బీఎస్పీ దూరం
INDIA vs NDA UP by Election : ఉప ఎన్నిక జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ మౌ జిల్లాలోని ఘోసీ అసెంబ్లీ స్థానంలో బీజేపీ తరఫున ధారాసింగ్ చౌహాన్ బరిలో నిలిచారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి వీడ్కోలు చెప్పి బీజేపీలో చేరిన ఆయన.. శాసనసభకు సైతం రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ధారాసింగ్‌కు వ్యతిరేకంగా ఎస్పీ నుంచి సుధాకర్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆప్, సీపీఎం, సీపీఐ, ఆర్ఎల్డీ సుధాకర్‌కు మద్దతు ప్రకటించాయి. మొత్తంగా ఈ స్థానం నుంచి 10 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. పోటీ ప్రధానంగా బీజేపీ, ఎస్పీ మధ్యే ఉండనుంది. రాష్ట్రంలోని మరో ప్రధాన పార్టీ అయిన బీఎస్పీ.. పోటీకి దూరంగా ఉంది. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న కారణంగానే ఈ ఉప ఎన్నికకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీఎస్పీ వర్గాలు చెబుతున్నాయి.
'ఇండియాకు తొలి విజయం ఇక్కడే'
ఝార్ఖండ్‌లోని డుమ్రి నియోజకవర్గంలోనూ ఇండియా, ఎన్డీఏ కూటముల మధ్య పోటీ నెలకొంది. మాజీ విద్యాశాఖ మంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యే జగర్నాథ్ మహతో మరణంతో ఈ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. జేఎంఎం తరఫున జగర్నాథ్ భార్య బేబీ దేవి బరిలో ఉండగా.. ఎన్డీఏ తరఫున యశోద దేవి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తొలి విజయం ఇక్కడే నమోదవుతుందని జేఎంఎం అధినేత, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థానానికి ఆరుగురు పోటీ చేస్తున్నారు. ఎంఐఎం సైతం తన అభ్యర్థిని బరిలోకి దించింది.
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సైతం ఉప ఎన్నిక జరగనుంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, కేబినెట్ మంత్రి చందన్ రామ్ దాస్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కన్నుమూసిన నేపథ్యంలో ఈ ఎన్నిక జరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది. 2007 నుంచి చందన్ రామ్ ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా నాలుగు సార్లు ఇక్కడి నుంచి గెలిచారు. ప్రస్తుతం ఆయన భార్య పార్వతి దాస్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున బసంత్ కుమార్ బరిలో ఉన్నారు. ఈ రెండు పార్టీలు కాకుండా.. సమాజ్‌వాదీ, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్, ఉత్తరాఖండ్ పరివర్తన్ పార్టీ తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి.
చాందీ కంచుకోటకు ఎన్నిక..
కేరళ కాంగ్రెస్ దిగ్గజం ఊమెన్ చాందీ మరణంతో ఖాళీ అయిన పూతుపల్లి నియోజకవర్గానికి సైతం ఉప ఎన్నిక జరగనుంది. ప్రధానంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే పోటీ ఉండనుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తరఫున చాందీ తనయుడు చాందీ ఊమెన్ బరిలో ఉన్నారు. లెఫ్ట్ కూటమి తరఫున థామస్ జైక్ సీ ఆయన్ను ఢీకొడుతున్నారు. అటు, బీజేపీ సైతం మోదీ ఇమేజ్ను, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి అజెండాను ఆసరా చేసుకొని ఎన్నికల బరిలో దిగింది. కొట్టాయం జిల్లా బీజేపీ అధ్యక్షుడు జీ లిజిన్లాల్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. 53 ఏళ్లుగా ఈ స్థానానికి ఊమెన్ చాందీ నేతృత్వం వహించగా.. ప్రస్తుత ఎన్నికల్లో ఓటర్లు ఏ తీర్పు ఇవ్వనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
త్రిపురలో రెండు చోట్ల..
త్రిపురలోని ధన్‌పుర్, బోక్సానగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం ఎన్నికలు జరగనున్నాయి. మైనారిటీల ప్రాబల్యం అధికంగా ఉండే బోక్సానగర్‌లో బీజేపీ తరఫున తఫజ్జల్ హుస్సేన్ పోటీ చేస్తున్నారు. సీపీఎం తరఫున మిజాన్ హుస్సేన్ బరిలో ఉన్నారు. ధన్పుర్లో బీజేపీ తరఫున బిందు దేబ్నాథ్, సీపీఎం తరఫున కౌశిక్ దేబ్నాథ్ బరిలో ఉన్నారు. త్రిప్రా మోథా, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాయి.
'ఇండియా కూటమితో సంబంధం లేదు'
ఇదిలా ఉంటే.. బంగాల్ ఉప ఎన్నిక ఇండియా కూటమి ఐక్యతకు సవాల్‌గా నిలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన ధుప్‌గుడి అసెంబ్లీ స్థానానికి కమలం పార్టీ, అధికార టీఎంసీతో పాటు కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి సైతం పోటీ పడుతోంది. కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించిన అధీర్ రంజన్ చౌదరి.. బీజేపీతో పాటు మమత సర్కారుపై పదునైన విమర్శలు గుప్పించారు. ఇది స్థానిక ఎన్నిక మాత్రమేనని.. ఇండియా కూటమికి దీనితో సంబంధం లేదని అధీర్ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిలో ఐక్యత లోపించిందని బీజేపీ ఆరోపించగా.. కమలం పార్టీకి మేలు చేసేందుకే కాంగ్రెస్-లెఫ్ట్ పోటీ చేస్తున్నాయని టీఎంసీ ఎదురుదాడికి దిగింది.