భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో ఎదురవుతున్న సవాళ్లను సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితి స్పష్టం చేస్తోందని సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవాణే పేర్కొన్నారు. పాత సవాళ్ల తీవ్రత పెరిగిందని, వీటికితోడు కొత్తవి కూడా వస్తున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో ఎదురయ్యే ముప్పులకు అనుగుణంగా భారత సైన్యం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతుందని చెప్పారు.
సైనిక మేధోమథన సంస్థ 'సెంటర్ ఫర్ ల్యాండ్ వార్‌ఫేర్ స్టడీస్' గురువారం నిర్వహించిన ఒక సదస్సులో నరవాణే ఈ వ్యాఖ్యలు చేశారు. పరిమిత బడ్జెట్లతో సామర్థ్యాన్ని పెంచుకోవడం సైనిక దళాల ముందున్న ప్రధాన సవాల్ అని చెప్పారు. తాము నేల, ఆకాశం, సముద్రంలో బలాన్ని పెంచుకునే అంశంపై దృష్టి సారిస్తుండగా, శత్రు దేశం మాత్రం అంతరిక్షం, సైబర్, ఇన్‌ఫర్మాటిక్స్ వంటి కొత్త రంగాలకు యుద్ధరంగాన్ని తీసుకుపోయిందన్నారు. హైపర్‌సోనిక్ వాహనాలు, మెరుగైన గగనతల రక్షణ సామర్థ్యాలనూ సంపాదించుకుంటోందని చెప్పారు. అందువల్ల భవిష్యత్ యుద్ధాల్లో గెలవాలంటే ఇతర రంగాలకూ భారత సైనిక దళాలు విస్తరించాల్సి ఉంటుందన్నారు.
ఇదీ చదవండి:డీఆర్డీఓ మాజీ ఫొటోగ్రాఫర్‌కు జీవితఖైదు