గతేడాది దేశవ్యాప్తంగా రోజూ సగటున 31 మంది పిల్లలు ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ తెలిపింది. 2020లో 11 వేల 396 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్సీఆర్బీ పేర్కొంది. 2019లో 9 వేల 613 మంది, 2018లో 9 వేల 413 మంది చిన్నారులు బలవన్మరణానికి పాల్పడినట్లు వివరించింది. గత ఏడాది కరోనా మహమ్మారి వల్ల చిన్నారులు ఎదుర్కొన్న మానసిక సమస్యలే ఆత్మహత్యలు పెరగడానికి కారణమై ఉండొచ్చని చెప్పింది.
కారణాలనేకం..
18 ఏళ్ల వయసులోపున్న వారిలో కుటుంబ సమస్యల కారణంగా 4,006, ప్రేమ వ్యవహారాలతో 1,337 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. హీరోల పట్ల ఆరాధన, నిరుద్యోగం, దివాలా, నపుంసకత్వం, మాదకద్రవ్యాల వినియోగం లాంటివి కూడా 18 ఏళ్ల వయసులోపు ఉన్న వారి ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా తెలిపింది.
దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన పిల్లల్లో పెరుగుతున్న ఆత్మహత్యలపై 'సేవ్ ద చిల్డ్రన్' డిప్యూటీ డైరెక్టర్ ప్రభాత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
"పెరుగుతున్న పిల్లల ఆత్మహత్యల సంఖ్య వ్యవస్థాగత వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది తల్లిదండ్రులు, ప్రభుత్వాల సమష్టి బాధ్యత. పిల్లలు వారి కలలను నెరవేర్చుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందించాలి."
-ప్రభాత్ కుమార్
పెరిగిన ఒత్తిడి..
కొవిడ్-19 కారణంగా పాఠశాలలు మూతపడటం, ఒంటరితనం వల్ల మానసిక ఆరోగ్య సమస్య మరింత తీవ్రమైందని 'చైల్డ్ రైట్స్ అండ్ యూ' డైరెక్టర్ ప్రీతి మహారా అభిప్రాయపడ్డారు. కరోనా భయం పలు కుటుంబాల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని మిగిల్చిందని చెప్పారు.
గృహ నిర్బంధం, స్నేహితులు, ఉపాధ్యాయులు, ఇతరులను కలిసే వీలు లేకపోవడం వల్ల కూడా పిల్లల్లో విపరీతమైన మానసిక ఒత్తిడి పెరిగింది. పిల్లలు ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మరికొంత మంది సామాజిక మాధ్యమాలకు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఇంకొంతమంది ఆన్‌లైన్ బెదిరింపులు, సైబర్ నేరాలకు గురయ్యారు.
-ప్రీతి మహారా
చిన్నారుల ఆత్మహతలు తగ్గించే అంశంపై సమాజం దృష్టి సారించాలని సెంటర్ ఫర్ అడ్వకసీ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ అఖిలా శివదాస్ పేర్కొన్నారు.
"వివిధ సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ప్రత్యేక సంరక్షణ, కౌన్సిలింగ్ అందిచాలి. దీనికోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి."
-అఖిలా శివదాస్
ఇవీ చదవండి: