నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఐక్యరాజ్యసమితి మిలిటరీ పరిశీలకుల(యూఎన్‌ఎంఓజీఐపీ) జీపును భారత సైన్యం కావాలనే లక్ష్యంగా చేసుకుందని పాక్ చేస్తున్న ఆరోపణలు కుట్రపూరితమైనవని విశ్రాంత ఆర్మీ జనరల్ అశోక్ కే మెహతా అన్నారు. యూఎన్ఎంఓజీఐపీని ప్రస్తావిస్తూ ఈ తరహా ఆరోపణలు పాక్ తొలిసారి చేస్తోందని తెలిపారు. అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ను తప్పుగా చూపాలని పాక్ అసత్య ప్రచారాలు చేస్తోందని అశోక్ చెప్పారు.
" భారత్‌పై పాకిస్థాన్ ఎప్పుడూ నిందలు మోపుతూనే ఉంటుంది. ప్రపంచ దేశాల ముందు భారత్‌ను తప్పుగా చూపాలనే కుట్రలో భాగంగానే ఈ తరహా ఆరోపణలు చేస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు భారత సైన్యం ఏ విధంగా బదులిస్తుందో మనకు తెలుసు. పాకిస్థాన్ చర్యలకు భారత్ దీటుగా బదులిచ్చే క్రమంలోనే పొరపాటున ప్రమాదవశాత్తు ఐరాస మిలటరీ పరిశీలకుల వాహనానికి ఏమైనా జరిగి ఉండవచ్చు. అంతేగానీ వాస్తవంగా కావాలని దాడి జరగే అవకాశమే లేదు."
-అశోక్ కే మెహతా, విశ్రాంత ఆర్మీ జనరల్.
2021లో ఐరాస భద్రతా మండలి ఛైర్మన్ బాధ్యతలను భారత్ చేపట్టనున్న నేపథ్యంలో పాక్ కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని మెహతా అన్నారు. అయితే ఐరాస మిలిటరీ పరిశీలకుల వాహనంపై దాడి ఆరోపణలను భారత్ ఖండించినప్పటికీ, అంతర్జాతీయ మీడియాను పిలిచి ఈ దాడి నిజంగా జరిగిందని పాకిస్థాన్ రుజువు చేసే అవకాశాలూ ఉన్నాయని పేర్కొన్నారు.
భారత రాయబారికి సమన్లు
ఐరాస మిలిటరీ పరిశీలకుల వాహనంపై దాడి జరిగినందుకు నిరసనగా మరునాడే ఇస్లామాబాద్‌లోని భారత రాయబారికి సమన్లు పంపి నిరసన వ్యక్తం చేసింది పాకిస్థాన్.