తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై పరిష్కారం వచ్చే వరకు వెనక్కి తగ్గకూడదని మోదీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తరచూ ఇరుదేశాల సైన్యాధికారుల మధ్య చర్చలు జరగుతున్నప్పటికీ బలగాల ఉపసంహరణలో చెప్పుకోదగ్గ పురోగతి లేకపోవడం వల్ల భారత్ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో చైనా సైన్యం ఎంతకాలం ఉంటుందో అప్పటివరకు మన బలగాలను సైతం కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
1982లో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాద పరిష్కారానికి 8 ఏళ్లు పట్టింది. అలానే ఇప్పుడు కూడా ఎన్నాళ్లైనా వెనక్కి తగ్గకూడదని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది.
అదే వైఖరి..
ఒకవైపు చర్చలు జరుగుతున్నా.. లద్దాఖ్‌లోని డెప్సాంగ్ బుల్గే, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సైన్యం దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు లద్దాఖ్ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీ. కె. మేనన్ అన్నారు. లద్దాఖ్ వివాదంపై శాంతియుత పరిష్కారాన్ని భారత్ కోరుకుంటున్నప్పటికీ చైనా మాత్రం ఆ దిశగా అడుగులు వేయటం లేదు. 2020 మే నెలలో జరిగిన.. గల్వాన్ ఘటన అనంతరం సరిహద్దుల్లో చైనా దూకుడు పెంచింది. ఒక్క లద్దాఖ్‌లోనే కాకుండా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఆ దేశ సైన్యం కదలికల్లో వేగం పెరగడం సహా సైనిక మౌలిక సదుపాయాలను డ్రాగన్ భారీగా పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలోనే రష్యాకు చెందిన ఎస్-400 క్షిపణి వ్యవస్థను సైతం డ్రాగన్ మోహరించటం వల్ల భారత్ అందుకు బదులుగా భారీగా బలగాలను సరిహద్దులకు తరలించింది. ఉద్రిక్తతలకు చైనా స్వస్తి పలికే వరకు భారత బలగాలు సైతం సరిహద్దుల్లో చురుగ్గా వ్యవహరిస్తాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరగాలంటే లద్దాఖ్ విషయంలో ఒక స్పష్టమైన వైఖరిని చైనా అవలంబించాలని మోదీ ప్రభుత్వం బలంగా కోరుకుంటోంది. ఈ క్రమంలో గత శనివారం జరిగిన 12 విడత సైనిక చర్చల్లోనూ భారత్ ఇదే విషయాన్ని లేవనెత్తింది. మరోవైపు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరగాలంటే లద్దాఖ్ విషయంలో చైనా తన వైఖరేంటో చెప్పాలని భారత్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. దీనిపై స్పష్టత వచ్చినప్పుడే సరిహద్దుల్లో ఒకప్పటి ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ఆర్మీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదీ చదవండి : 'నిర్మాణాత్మకంగా భారత్-చైనా సైనిక చర్చలు'