Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 18,930 మంది వైరస్ బారినపడగా.. మరో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య బుధవారంతో పోలిస్తే 2,500కు పైగా కేసులు పెరిగాయి. కొవిడ్ నుంచి 14,650 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.53 శాతం వద్ద స్థిరంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.26 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతానికి పెరిగింది.
- మొత్తం మరణాలు: 5,25,305
- యాక్టివ్ కేసులు: 1,19,457
- కోలుకున్నవారి సంఖ్య: 4,29,21,977
Vaccination India: భారత్‌లో బుధవారం 11,44,489 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,33,18,772కు చేరింది. మరో 4,38,005 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
కొత్త వేరియంట్
కరోనా ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ బీఏ 2.75 భారత్‌లో వెలుగుచూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తొలుత భారత్‌లో కనిపించిన ఈ వేరియంట్.. ఇప్పటివరకు 10 దేశాల్లో బయటపడ్డట్లు తెలిపింది. దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలను విశ్లేషిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు. బీఏ.2.75కి సంబంధించి పరిమిత స్థాయిలో జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతుండటంతో దీని విశ్లేషణకు పూర్తి సమాచారం అందుబాటులో లేదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. బీఏ.2.75 ఉపరకాన్ని డబ్ల్యూహెచ్ఓ ట్రాక్ చేస్తోందని తెలిపారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా మరింత డేటాను సేకరిస్తున్నట్లు వివరించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 9,52,758 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,585 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 55,75,61,264కు చేరింది. మరణాల సంఖ్య 63,66,875కు చేరింది. ఒక్కరోజే 5,27,087మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,13,80,711కు చేరింది.
- ఫ్రాన్స్‌లో 1,54,615 మంది వైరస్ బారిన పడ్డారు. 53 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 1,35,402 కేసులు బయటపడగా.. 108 మంది తుది శ్వాస విడిచారు.
- ఇటలీలో కొత్తగా 1,07,786 మందికి వైరస్ సోకగా.. 72 మంది మరణించారు.
- అమెరికాలో ఒక్కరోజే 91,132 మంది కొవిడ్ బారినపడగా.. 316 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో 76,850 కేసులు నమోదు కాగా.. 335 మంది మరణించారు.
ఇవీ చదవండి: 58 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన ఎమ్మెల్యే!
డోలో-650 మాత్రల తయారీ సంస్థపై ఐటీ దాడులు.. ఒకేసారి 40 చోట్ల..!