పాంగాంగ్ సరస్సు నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో గోగ్రా పర్వతాలు, దెప్సాంగ్, హాట్‌స్ప్రింగ్స్‌లో ఉపసంహరణ ప్రక్రియ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి భారత్- చైనా బలగాలు. ఈ మేరకు శుక్రవారం ఇరు దేశాల సైనికాధికారులు సమావేశం కానున్నారు.
"భారత్-చైనా మధ్య కార్ఫ్స్ కమాండర్ స్థాయిలో 11వ ధఫా చర్చలు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్ ప్రాంతంలో ఈ భేటీ ఉంటుంది. లద్దాఖ్‌లో పలు ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల సైనికాధికారులు చర్చించనున్నారు"
- భారత సైనిక వర్గాలు
ఏడాది కాలంగా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన.. సైనిక, రాజకీయ స్థాయిల్లో సమగ్ర చర్చల ద్వారా కొలిక్కి వస్తోంది. ఇప్పటివరకు ఇరు దేశాలు మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయిలో పది సార్లు చర్చలు జరగ్గా.. పాంగాంగ్ సరస్సు నుంచి బలగాల ఉపసంహరణ గత నెలలోనే పూర్తయింది.
ఆలస్యం చేయొద్దు..
ఇరు దేశాల సైనికాధికారులు చర్చలు జరపడం ఆలస్యం చేయకూడదని చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియాన్ గురువారం పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను కట్టడి చేసే దిశగా ఇరు దేశాలు అడుగులేయాలని అన్నారు.
ఇదీ చదవండి:రఫేల్ ఒప్పందంలో అక్రమాలు జరగలేదు: డసో