ఓటర్లకు అసాధారణ హామీలు ప్రకటించి ప్రస్తుతం వార్తల్లో నిలిచారు తమిళనాడుకు చెందిన 33 ఏళ్ల తులం శరవణన్. ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రకటించిన హామీలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఓ టీవీ జర్నలిస్టుగా పనిచేసిన శరవణన్.. అసెంబ్లీ ఎన్నికల్లో మధురై దక్షిణ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. నామినేషన్ దాఖలు చేసేందుకు రూ.20 వేల అప్పు కూడా చేశారు. తాను గెలిస్తే మాత్రం ఈ హామీలన్నీ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
ఇవే కాదు..
నియోజకవర్గ ప్రజలను నిత్యం చల్లదనం అందించేందుకు 300 అడుగుల కృత్రిమ మంచుకొండ, ప్రతి కుటుంబానికీ ఓ బోటు, అంతరిక్ష పరిశోధన కేంద్రం, రాకెట్ లాంచ్‌పాడ్ ఏర్పాటు చేస్తాననీ హామీల్లో పేర్కొన్నారు. అయితే.. ఈ హామీలన్నీ ఊరికే చేయట్లేదని శరవణన్ చెప్తున్నారు.
చైతన్యం కోసమే..
ప్రస్తుత రాజకీయాల్లో నీటిమూటల్లాంటి నేతల అసత్య మాటలను నమ్మకుండా ప్రజలను చైతన్యం చేసేందుకే తానూ ఈ హామీలు ప్రకటించినట్లు శరవణన్ వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో గెలవడం పక్కన పెడితే ఈ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం కలిగించడంలో విజయం సాధించానని చెప్పారు. ప్రచారానికి డబ్బులు లేకున్నా.. తన సహచరులు పంపిన మెసేజ్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయన్నారు.
ఉచిత హామీలపై ప్రజలు ఆలోచన చేస్తున్నారని శరవణన్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆకర్షక హామీలను నమ్మి ఓటు వేస్తే అది చెత్తబుట్టలోకి వెళ్తుందని చెప్పేందుకే తాను ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయనకు కేటాయించిన గుర్తు కూడా చెత్తబుట్ట కావడం గమనార్హం. ఇప్పటికే తమిళనాట ప్రధాన పార్టీలన్నీ 'ఉచిత' హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: ఎన్నికల్లో నేతల సిత్రాలు చూడతరమా!