ఐటీ శాఖ ఓ కార్మికుడికి గట్టి షాక్ ఇచ్చింది. 14 కోట్లు ఆదాయపు పన్ను కట్టలేదని అతనికి నోటీసులు జారీ చేసింది. పన్ను కట్టకపోతే కఠిన చర్యలు తీసకుంటామని హెచ్చరించింది. ఈ ఆశ్చర్యకరమైన ఘటన బిహార్‌లోని రొహ్తాస్లో వెలుగులోకి వచ్చింది. అయితే తాను ఓ సాధారణ కూలీనని, ఇలా తనపై ఇలా పన్ను భారం విధిస్తే ఎలా కట్టాలని వాపోతున్నాడు ఆ యువకుడు.
అసలేం జరిగిందంటే..
బిహార్‌లోని రోహ్తాస్కు చెందిన మనోజ్ యాదవ్ అనే వ్యక్తి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజంతా శ్రమిస్తే అతనికి నెలకు 12 నుంచి 15 వేల వరకు ఆదాయం వస్తుంది. అయితే తన పేరుపై చాలా వ్యాపారాలున్నాయని, వాటిపై రూ.14 కోట్లు పన్ను కట్టాలని ఐటీ శాఖ మనోజ్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అసలు తాను ఎటువంటి వ్యాపారాలు చేయట్లేదని, తనకు అన్యాయంగా నోటీసులు జారీ చేశారని మనోజ్ వాపోతున్నాడు. అయితే హరియాణా, దిల్లీలో కూలీ పనులకు వెళ్లినప్పుడు అక్కడ కాంట్రాక్టర్లకు తన ఆధార్, పాన్ కార్డు కాపీలను ఇస్తుంటానని తెలిపాడు. బహుశా అక్కడే ఏదో తప్పిదం జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నాడు.