మధ్యప్రదేశ్లోని లింగా, హట్టా ప్రాంతాలకు వెళ్తే ఓ అమ్మాయి పెద్ద ఆటో నడపడం తారసపడుతుంది. అది చూడగానే తొలుత ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. కానీ, తండ్రి ఒంటరిగా పడే కష్టం చూడలేక మూడు చక్రాల బండిని రెండు చేతులా చెమడ్చోచి నడిపేది.. కుటుంబానికి అండగా నిలవడం కోసమేనని తెలిస్తే.. ఆమెపై గౌరవం పెరుగుతుంది.
తనే.. బాలాఘాట్ జిల్లాకు చెందిన పూనమ్ మేశ్రమ్. ఆమెకు మరో ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో వారి కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. దీంతో తండ్రికి ఆర్థికంగా ఆసరా కావాలకున్న పూనమ్.. ఆటో మార్గాన్ని ఎంచుకుంది.
"మాకు కుటుంబ సమస్యలు వచ్చి పడ్డాయి. ఈ సమయంలో మా కూతురు అండగా నిలుస్తోంది. నాకు ఆరుగురు కూతుళ్లు. అందులో పూనమ్ నాలుగో కూతురు. ఇంకా చదువుకుంటోంది. ఆమె ఉన్నత చదవులు చదివి, గొప్పగా ఎదిగేందుకు పూర్తిగా సహకరిస్తా. ప్రస్తుతానికి పార్ట్ టైం.. ఆటో తోలుతోంది. ఆమె సోదరీమణుల చదువు, ఇతర ఖర్చులను కూడా తనే భరిస్తోంది."
-పూనమ్ తండ్రి
తొలి మహిళా ఆటో డ్రైవర్..
బాలాఘాట్లోనే.. పూనమ్ తొలి మహిళా ఆటో డ్రైవర్. తను ఆటో నడిపే సమయంలో తమ యూనియన్ సభ్యులు, తెలిసినవారు ఎంతో సహకరించేవారని పూనమ్ తెలిపింది. 12వ తరగతి పూర్తి చేసిన పూనమ్.. ప్రస్తుతం కంప్యూటర్ శిక్షణ పొందుతోంది.
"నేను మా నాన్న నుంచి ఆటో నడపడం నేర్చుకున్నాను. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడం వల్ల మా ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. చాలా సమస్యలు ఎదురయ్యాయి. అప్పుడు నాకు ఏ పనీ లేదు. దీంతో నాన్నకు సహాయంగా ఉండాలని ఆటో నడుపుతున్నా. ఆటో నడిపేటప్పుడు ఎలాంటి సమస్య లేదు. ఎవరితోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. చదువుకునే సమయంలో చదువుకుంటా. తరగతులకు హాజరవ్వాల్సిన వేళలో హాజరవుతా. దాంతో పాటే ఆటో నడిపిస్తా."
-పూనమ్, ఆటో డ్రైవర్
తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను మోస్తున్న పూనమ్.. భవిష్యత్తులో బీఎమ్ చదవాలని ఆశపడుతోంది.
ఇదీ చూడండి: ఆ గ్రామాన్ని టచ్ చేయని కరోనా.. ఎలాగంటే?