హిమాచల్‌ప్రదేశ్ కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయలో విషాదం చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగిపడి 9 మంది పర్యటకులు మృతి చెందారు. వారందరూ టెంపోలో ఉండగా పెద్ద బండరాయి వచ్చి వాహనాన్ని ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ప్రమాదంలో మరో చోట ఇంకో వ్యక్తి గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతుల్లో రాజస్థాన్‌కు చెందినవారు నలుగురు, ఛత్తీస్‌గఢ్- ఇద్దరు, మహారాష్ట్ర- ఒకరు, దిల్లీ- ఇద్దరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
భూకంపం సంభవించినట్లు ఒక్కసారిగా.. కొండ పైనుంచి బండరాళ్లు కిందకు వేగంగా దూసుకువచ్చాయి. రాళ్ల దాటికి లోయలో ఉన్న వంతెన కూలిపోయింది. పలు వాహనాలు, పర్యాటకుల విశ్రాంతి గదులు ధ్వంసమయ్యాయి. ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉన్న ఆ దృశ్యాలను పలువురు పర్యటకులు చిత్రీకరించారు.
ఈ ఘటనపై స్పందించిన హిమాచల్‌ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఆయన.. గాయపడినవారి చికిత్స ప్రభుత్వమే చూసుకుంటుందని తెలిపారు.
రాష్ట్రపతి సానుభూతి..
ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు సంతాపం తెలిపారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రధాని సంతాపం..
కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన పర్యటకుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడినవారికి రూ.50వేలు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: విరిగిపడ్డ కొండచరియలు- చిక్కుకున్న 300మంది!