భారీ డ్రగ్స్ రాకెట్‌ను చేధించారు పంజాబ్ పోలీసులు. అంతర్జాతీయ విపణిలో రూ.100కోట్లు విలువ చేసే హెరాయిన్‌ను (heroin drug) స్వాధీనం చేసుకున్నారు. ఈ సిండికేట్‌ను జైళ్లలో ఉన్న గ్యాంగ్స్టర్లు నిర్వహిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరు డ్రగ్ డీలర్లను సోమవారం అరెస్టు చేశారు.
పారిపోయేందుకు ప్రయత్నించి..
కపుర్తలలో ఓ ట్రక్కును, మరో కారును తనిఖీ చేస్తుండగా ఈ ముఠా పట్టబడిందని పంజాబ్ డీజీపీ దిన్కర్ గుప్తా తెలిపారు. "తొలుత వాహనాలను ఆపమని ఆదేశించగా, వారు అపకుండా పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో కేజీ చొప్పున ఉన్న 20 ప్యాకెట్ల హెరాయిన్ బయటపడింది," అని డీజీపీ వెల్లడించారు.
గ్యాంగ్‌స్టర్ పాత్ర?
వీటిని శ్రీనగర్ నుంచి ట్రక్కులో తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఓ గ్యాంగ్‌స్టర్ పాత్ర ఉందని అనుమానిస్తున్నట్లు చెప్పారు. హెరాయిన్‌ను అందుకోవడానికి పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ రజనీష్ కుమార్ సోదరుడు పీటర్‌ను పంపినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.
ఇదీ చూడండి: రూ. 879కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్