హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, మనాలీలో ప్రజలు గుంపులుగా తిరగటంపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా అయితే.. ఇప్పటి వరకు చేపట్టిన కొవిడ్ కట్టడి చర్యలు విఫలమవుతాయని పేర్కొంది. కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న 73 జిల్లాలకు లేఖ రాసింది వైద్య శాఖ.
మరోసారి ఆంక్షలు!..
"ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోతే.. మరోసారి ఆంక్షలను విధించాల్సి ఉంటుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సెకండ్ వేవ్ ప్రభావం ఉంది. యాక్టివ్ కేసులు సంఖ్య 5 లక్షల దిగువకు చేరాయి."
-- లవ్ అగర్వాల్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి
మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అరణాచల్ ప్రదేశ్, త్రిపుర.. రాష్ట్రాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి మించి ఉందన్నారు.
భవిష్యత్తులో ప్రధాన సవాల్.. మూడో వేవ్ కాదని, దానిని మనం ఎలా ఎదుర్కొన్నాం అనేదే ముఖ్యమని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్. బలరాం భార్గవ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అవయవాల శక్తిపై కరోనా దెబ్బ!