కుల వివక్ష కారణంతో ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్.. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. క్యాంపస్‌లో కుల వివక్ష ఉందంటూ.. అడ్మినిస్ట్రేషన్‌కు లేఖ రాశారు. ఉన్నత స్థానంలోని వ్యక్తుల నుంచే ఈ వివక్ష ఎదుర్కొన్నానంటూ తెలిపారు.
"ఐఐటీ మద్రాస్‌ను వీడి మరో సంస్థలోకి నేను వెళ్లిపోతున్నాను. ఈ విద్యాసంస్థను విడిచిపెట్టడానికి ప్రధాన కారణం.. కుల వివక్ష. ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తుల నుంచే ఈ వివక్ష ఎదురవుతోంది. వివక్షపూరిత ఘటనలు అనేక సార్లు తలెత్తాయి. దీన్ని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటాను."
-ఐఐటీ మద్రాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్
విద్యాసంస్థలో ఎస్సీ, ఓబీసీ విద్యార్థులతో తాను చర్చించినట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ పేర్కొన్నారు. కుల వివక్ష లేకపోవడమనేది వాస్తవ దూరంగా ఉందని తనకు వారి నుంచి తెలిసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో.. ఎస్సీ, ఓబీసీ విద్యార్థుల అనుభవాలపై చర్చించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని విద్యాసంస్థ ఉన్నతాధికారులను కోరినట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిషన్ సభ్యులతో పాటు, సైకాలజిస్టులకు ఈ కమిటీలో స్థానం కల్పించాలని సూచించినట్లు తెలిపారు.
ఈ లేఖ విషయం క్యాంపస్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలపై స్పందించేందుకు ఐఐటీ మద్రాస్ నిరాకరించింది. తమకు అధికారికంగా ఫిర్యాదు అందితే సమస్యపై దృష్టిసారిస్తామని చెప్పుకొచ్చింది.
ఇదీ చదవండి: సగం కాలిపోయి.. అర్ధనగ్నంగా బాలిక మృతదేహం