స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలున్న కొవిడ్ బాధితులకు ‘ఇండోమెథాసిన్’ ద్వారా సమర్థ చికిత్స అందించవచ్చని ఐఐటీ-మద్రాస్ పరిశోధకుల క్లినికల్ పరీక్షల్లో నిర్ధరణ అయింది. ఇండోమెథాసిన్ అనేది... నాన్-స్టిరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఔషధం. సురక్షితమైనది. తక్కువ ధరకే లభ్యమవుతుంది కూడా. కొవిడ్ నివారణలో దీని ప్రభావాన్ని శాస్త్రీయంగా నిర్ధరించేందుకు ఇటలీ, అమెరికా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్న క్రమంలోనే... ఐఐటీ-మద్రాస్ పరిశోధకులు కొవిడ్ ఒకటి, రెండో దశల్లో పలువురు బాధితులకు ప్రయోగాత్మకంగా ఈ ఔషధాన్ని అందించి, ఫలితాలను నమోదు చేశారు. ‘పనిమలార్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’లో చేపట్టిన ఈ పరిశోధనకు ఐఐటీ-మద్రాస్ అనుబంధ ఫ్యాకల్టీ, ఎంఐవోటీ ఆసుపత్రుల నెఫ్రాలజీ విభాగం డైరెక్టర్ డా.రాజన్ రవిచంద్రన్ నేతృత్వం వహించారు. అన్ని కరోనా వైరస్ వేరియంట్లకు వ్యతిరేకంగా ఇండోమెథాసిన్ సమర్థంగా పనిచేస్తోందని, మొదటి, రెండో దశ కరోనా ఉద్ధృతి సమయంలో దీన్ని పలువురు రోగులకు ఇచ్చి చూశామని ఆయన తెలిపారు.
నాలుగు రోజుల్లోనే స్వస్థత...
'ఆసుపత్రిలో చేరిన మొత్తం 210 మంది కొవిడ్ బాధితుల్లో 103 మందికి ప్రామాణిక చికిత్సతో పాటు ఇండోమెథాసిన్‌ను కూడా ఇచ్చాం. ప్రతిరోజూ వారికి దగ్గు, జ్వరం, కండరాల నొప్పి వంటి లక్షణాలు.. ఆక్సిజన్ స్థాయులు ఎలా ఉన్నాయన్నది గమనించాం. ఇండోమెథాసిన్ తీసుకున్నవారికి ఎలాంటి ఆక్సిజన్ సమస్య తలెత్తలేదు. మిగిలిన వారిలో 20% మందికి మాత్రం ఆక్సిజన్ స్థాయులు 93% కంటే దిగువకు పడిపోయాయి. ఇండోమెథాసిన్ తీసుకున్నవారికి మూడు నాలుగు రోజుల్లోనే లక్షణాలు తగ్గిపోయాయి. కిడ్నీ, కాలేయ పరీక్షల్లోనూ వారికి సాధారణ ఫలితాలే వచ్చాయి. 14వ రోజు వచ్చేసరికి వారంతా పూర్తి ఆరోగ్యంగా ఉండగా, మిగతావారిలో కొన్ని సమస్యలు కొనసాగుతున్నట్టు గుర్తించాం' అని పరిశోధనలో పాల్గొన్న ఆర్.కృష్ణకుమార్ వివరించారు.
ఇదీ చదవండి: లక్ష జనాభా పైబడిన పట్టణాల్లో 24 గంటలూ విద్యుత్తు!