Artificial heart IIT Kanpur: కృత్రిమ గుండె తయారు చేసేందుకు ఐఐటీ కాన్పుర్ నడుం కట్టింది. ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి కృత్రిమ హృదయాన్ని రూపొందించేందుకు కసరత్తులు చేస్తోంది. ఐఐటీకి చెందిన ప్రొఫెసర్లు, అమెరికా నిపుణులు, ఎయిమ్స్, అపోలో, ఫోర్టిస్, మేదాంత వైద్య సంస్థలకు చెందిన సీనియర్ వైద్యులతో కూడిన బృందం ఈ టాస్క్‌ఫోర్స్‌లో భాగమైంది. వైద్య రంగంలో ఐఐటీ కాన్పుర్ సాధించిన ఘనతలపై చర్చించే సమావేశంలో ఈ మేరకు కృత్రిమ గుండె ఏర్పాటు ప్రాజెక్టుకు బీజం పడింది. లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్(ఎల్వీఏడీ) పేరుతో ఈ కృత్రిమ గుండెను రూపొందిస్తున్నారు.
IIT Kanpur Innovations:
"కరోనా సమయంలో ఐఐటీ కాన్పుర్ తక్కువ ధరతో కూడిన వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తయారు చేసింది. అయితే, ఐఐటీ కాన్పుర్ కృత్రిమ గుండె తయారు చేయలేదని కొంతమంది అన్నారు. దీన్ని మా విద్యాసంస్థ సవాల్‌గా స్వీకరించింది. వెంటనే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాం."
-అమితాబ్ బందోపాధ్యాయ్, ఐఐటీ కాన్పుర్ ప్రొఫెసర్
Artificial Heart India
కృత్రిమ గుండె పరికరం సిద్ధం కావడానికి రెండేళ్లు పడుతుందని బందోపాధ్యాయ్ తెలిపారు. అనంతరం జంతువులపై తొలిసారి ప్రయోగిస్తామని చెప్పారు. దశలవారీగా పూర్తిస్థాయిలో ఈ పరికరాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. పరికరం మార్కెట్లోకి వచ్చేందుకు ఐదేళ్లు పడుతుందన్నారు. గుండె పూర్తిగా విఫలం చెందిన రోగుల కోసం ఈ పరికరాన్ని ఉపయోగిస్తామని అమితాబ్ వెల్లడించారు. రీఛార్జ్ చేసుకోగలిగే ఎనిమిది బ్యాటరీలను పరికరంలో అమర్చనున్నట్లు తెలిపారు. బ్యాటరీలు 12 గంటల వరకు పనిచేస్తాయని చెప్పారు.
Artificial heart cost
ప్రస్తుతం ఇలాంటి కృత్రిమ గుండె పరికరాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటి ధర చాలా అధికంగా ఉంటోంది. ఐఐటీ కాన్పుర్ తయారు చేసే పరికరం ధర చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: భూసార పరీక్షలకు కొత్త సాధనం- 90 సెకన్లలోనే ఫలితం