బంగాల్లో ఇద్దరు కవలలు పోలికల్లోనే కాదు.. చదువులోనూ ఒకేలా మార్కులను సంపాదించారు. వారిద్దరూ వేర్వేరు విభాగాల్లో చదువుకున్నా సరే.. ఫలితాల్లో మాత్రం ఒకేలా మార్కులు సాధించి అందరిని ఆశ్చర్యపరిచారు. కోల్‌కతాలోని జాదవ్‌పుర్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న వీరిద్దరూ.. 9.54 జీపీఏ మార్కులు సాధించి యూనివర్సిటీ టాపర్లుగా నిలిచారు. డిసెంబర్ 24న జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు, సర్టిఫికెట్లు అందుకున్నారు.
కోల్‌కతా ప్రాంతానికి చెందిన సుభేందు, దివేందు ప్రమాణిక్‌లు 5 నిమిషాల తేడాలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆడుకోవడం, చదువుకోవడం.. అన్నీ కలిసే చేసేవారు. దీనికి తోడు వీరి ప్రవర్తన కూడా ఒకేలా ఉండేది. పదో తరగతి వరకూ ఇద్దరూ కలిసే చదవుకున్నారు. అయితే ఇంటర్ ఆపై చదువుల్లో మాత్రం వేర్వేరు సబ్జెక్ట్‌లను ఎంచుకున్నారు. విభాగం ఏదైనా సరే ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి.. కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక జాదవ్‌పుర్ యూనివర్సిటీలో చోటు సంపాదించారు.
సుభేందు జియాలజీ విభాగాన్ని ఎంచుకోగా.. దివేందు ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ విభాగాన్ని ఎంచుకున్నాడు. వీరిద్దరి విభాగాలు వేరైనా రోజూ కలిసే చదువుకునేవారు. దీంతో వారిద్దరూ సమానంగా.. 9.54 జీపీఏ మార్కులు సాధించి యూనివర్సిటీ టాపర్లుగా నిలిచారు. దివేందు ఐఐటీ-ఖరగ్‌పుర్‌లో ఉన్నత చదువుని కొనసాగించనుండగా.. సుభేందు జర్మనీ వెళ్లనున్నాడు. దీంతో వీరిద్దరి బంధం కొన్ని రోజుల పాటు తెరపడనుంది.