రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలు ఓ పెద్ద సాహసం చేయబోతున్నారు. భారత వైమానిక దళానికి చెందిన విమానంలో ప్రయాణిస్తూ.. రాజస్థాన్ బర్మెర్‌లోని జాతీయ రహదారిపై అత్యవసర ల్యాండింగ్ చేయనున్నారు. ఈ వారంలోనే ఈ మాక్ ల్యాండింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు(plane landing in highway).
రాజస్థాన్ బర్మెర్‌లోని జాతీయ రహదారిపై వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్స్, ఇతర విమానాలు అత్యవసరంగా దిగడం కోసం 3.5 కిలోమీటర్ల మేర ఎయిర్‌స్ట్రిప్ నిర్మించారు. ఈ ఎయిర్‌స్ట్రిప్ ప్రారంభోత్సవంలో భాగంగానే ఇద్దరు మంత్రులు ప్రయాణిస్తున్న విమానంతో.. మాక్ ల్యాండింగ్ చేయనున్నట్లు సమాచారం.
బర్మెర్ నేషనల్ హైవే... ఐఏఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు వినియోగించే తొలి జాతీయ రహదారిగా అధికారులు పేర్కొన్నారు.
2017, అక్టోబర్‌లో.. లఖ్‌నవూ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఐఏఎఫ్‌కు చెందిన ఫైటర్ జెట్స్, ట్రాన్స్పోర్ట్ విమానాలు మాక్ ల్యాండింగ్(fighter plane landing on agra-lucknow expressway) నిర్వహించాయి. అత్యవసర పరిస్థితుల్లో అలాంటి రహదారులను ల్యాండింగ్ కోసం వినియోగించుకోగలమని చూపేందుకు ఈ మాక్ ల్యాండింగ్ చేపట్టారు.
జాతీయ రహదారులపై ఎయిర్‌స్ట్రిప్స్‌ను అభివృద్ధి చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) అధికారులు.. ఐఏఎఫ్ అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. బర్మెర్ కాకుండా దేశవ్యాప్తంగా ఇంకా 12 జాతీయ రహదారుల్లో ఎయిర్‌స్ట్రిప్స్ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: రాహుల్ గాంధీ ఒక 'రాజకీయ కోకిల': భాజపా