ముంచుకొస్తున్న యాస్ తుపాను సహాయక చర్యల్లో భాగంగా భారత వైమానిక దళం 11 విమానాలను రవాణాకు.. మరో 25 హెలికాప్టర్లను మానవ సహాయం, విపత్తు నిర్వహణ కోసం సిద్ధం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో ఐఏఎఫ్ ఆదివారం 21 టన్నుల సహాయక సామగ్రిని సిద్ధం చేసింది. దీనితో పాటు 334 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కోల్‌కతా, పోర్ట్ బ్లెయిర్‌కు విమానాల్లో తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఐదు ప్రత్యేక విమానాలను ఉపయోగించి పట్నా, వారణాసి, అరక్కోణం నుంచి సహాయక సామగ్రి, పరికరాలు రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు.
తక్షణ చర్యలకు సిద్ధం..
యాస్ ప్రభావాన్ని వీలైనంత మేర తగ్గించేందుకు త్రివిధ దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకోసం భారతీయ కోస్ట్ గార్డ్ తక్షణ చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే తౌక్టే తుపాను ధాటికి గుజరాత్ తీరప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో బంగాల్, ఒడిశా తీరప్రాంతాల్లో యాస్ తుపాను తీరం దాటే సమయంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఐఏఎఫ్,హెచ్ఏఆర్డీ బృందాలను తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే భువనేశ్వర్, కోల్‌కతాకు తరలించింది కేంద్రం.
ఒడిశా పోర్ట్‌లో మొదటి ప్రమాద హెచ్చరిక..
యాస్ తుపాను అంతకంతకూ బలపడుతుండడం వల్ల ఒడిశాలోని అన్ని ఓడరేవుల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అన్ని పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం. అండమాన్‌కు వాయవ్య దిశలో 590 కి.మీ, పారదీప్ నుంచి 570 కి.మీ, బాలసోర్ నుంచి 670 కి.మీ, దిఘా నుంచి 650 కి.మీ దూరంలో వాయుగుండం కదిలాడుతున్నట్లు తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో పెను తుపానుగా మారుతుందని పేర్కొంది.
ఇదీ చూడండి: పొంచి ఉన్న 'యాస్' ముప్పు- అధికారులు అప్రమత్తం