కర్ణాటక భాజపా ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోళితో కలిసి ఓ అసభ్యకరమైన వీడియోలో ఉన్నట్లుగా భావిస్తున్న మహిళ.. తనకు రక్షణ కావాలని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. భద్రత కల్పించాలంటూ కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మైని కోరారు. ఆ దృశ్యాలు బయటపడటం వల్ల తన గౌరవానికి భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
"నాకు రాజకీయంగా మద్దతు లేదు. రమేశ్ జర్కిహోళి నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నారు. ఆ వీడియోను విడుదల చేశారు. ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు. వీడియో బయటకు వచ్చిన తర్వాత నా గౌరవానికి భంగం కలిగింది. నా గురించి విచారించడానికి అందరూ ఇంటికి వస్తున్నారు. మా తల్లితండ్రులు రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశారు. నేను కూడా మూడు నాలుగు సార్లు చనిపోవాలని ప్రయత్నించా. నాకు భద్రత లేదు. నేను అడుగుతుందల్లా నాకు రక్షణ కల్పించాలనే."
-మహిళ
మరోవైపు, తన నుంచి డబ్బులు లాగి, అప్రతిష్ఠ తీసుకొచ్చేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని శనివారం.. పోలీసులకు ఫిర్యాదు చేశారు జర్కిహోళి. ఫిర్యాదులో ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదు. అయితే ఈ కేసులో చాలా మంది ఉన్నారని.. నకిలీ సీడీలు సృష్టించి, ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారని ఆరోపించారు. తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు మూడు నెలల నుంచి సీడీల తయారీలో నిమగ్నమయ్యారని అన్నారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు.
ఇదీ కేసు!
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఓ సామాజిక కార్యకర్త మార్చి 2న.. రమేశ్ జర్కిహోళిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఆరోపణలను తొలుత ఖండించిన జర్కిహోళి.. తర్వాత మార్చి 3న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం, జర్కిహోళిపై కేసును ఉపసంహరించుకోవాలని సామాజిక కార్యకర్త నిర్ణయించుకున్నారు.
కాగా, ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపాయి.
ఇదీ చదవండి: కశ్మీర్లో ఎన్కౌంటర్- ఓ ఉగ్రవాది హతం