Husband Tortured wife With Electric Shock : ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరఠ్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. రెండో వివాహం చేసుకోవడం కోసం తనకు కరెంట్ షాక్ ఇచ్చి చంపాలని చూసినట్లు ఆరోపించింది. ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగిందంటే?
బాధితురాలు అందించిన ఫిర్యాదు ప్రకారం.. మీరట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లిసాడిగేట్ ప్రాంతంలో బాధితురాలు నివాసం ఉంటోంది. తన భర్త రెండో వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు ఆమె తెలిపింది. ఈ కారణంగా తనపై ఏదో ఒక నెపంతో దాడికి పాల్పడేవాడని ఆరోపించింది.
కరెంటు తీగలతో షాక్ ఇచ్చి తనను చంపడానికి భర్త ప్రయత్నించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తాను ఎలాగోలా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నట్లు చెప్పింది. చుట్టుపక్కల వారు తనను కాపాడారని మహిళ పేర్కొంది. అయితే పుట్టింటికి చేరుకున్న బాధితురాలు తన కుటుంబసభ్యులకు జరిగిన వ్యవహారమంతా చెప్పింది. భర్త, అత్త, మరిదిపై లిసాడీ గేట్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని వేడుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
"నా భర్త, అత్త, మరిది ఈ ముగ్గురు కలిసి నన్ను చంపడానికి యత్నించారు. పలుమార్లు అనవసరంగా నాపై భౌతిక దాడులకు పాల్పడేవారు. వారంతా కరెంట్ షాక్ ఇచ్చి నన్ను చంపాలనుకున్నారు. నాపై పెట్రోల్ పోసి కూడా చంపాలని నా మరిది యత్నించాడు"
-- బాధితురాలు
మహిళ దారుణ హత్య
కొన్నిరోజుల క్రితం.. ఉత్తర్ప్రదేశ్లోకట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ కసాయి భర్త ఆమె ముక్కునే కోసేశాడు. అక్కడితో ఆగకుండా అడ్డొచ్చిన కుమార్తెను అతి కిరాతకంగా ఉరితీసి చంపాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమంత్ విహార్‌లోని నౌబస్తాలో ఛోటూ షా, అతడి భార్య రుక్సర్, కుమార్తె అర్జు నివసించేవారు. ఛోటూ బ్రిజేష్ పటేల్ అనే వ్యక్తి దగ్గర కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే తన భార్య అయిన రుక్సర్ తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని చోటూ అనుమానించేవాడు. ఈ క్రమంలో వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. కొద్దికాలం ఇద్దరూ వేర్వేరుగా ఉన్నారు. అయితే పెద్దమనుషులు ఒప్పించడం వల్ల మళ్లీ కలిసారు. వారి మధ్య మళ్లీ ఓ సారి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఛోటూ షా తన భార్య ముక్కును కోసేశాడు.