సంజ్ఞల భాష ఒక్క బధిరులకే కాదు.. వివిధ ప్రాంతాల వారు మాట్లాడుకోవడానికి కూడా ఉపకరిస్తోంది. దిల్లీలో జరిగే గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువతీయువకులు ఈ భాషలో మాట్లాడుకుంటుండటం ఆసక్తికరంగా మారింది. దేశరాజధానిలోని భారతీయ సంజ్ఞల భాషల పరిశోధన, శిక్షణ కేంద్రం(ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్-ఐఎస్ఎల్ఆర్‌టీసీ) తరఫున ఒక శకటాన్ని ప్రదర్శించడం విశేషం. ఇందులో పాల్గొంటున్న 12మంది సంజ్ఞల భాషలోనే మాట్లాడుకుంటున్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ ఆధ్వర్యంలో ఈ కేంద్రం నడుస్తోంది. తమ కేంద్రం శకటం ఉన్నందుకు ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులు మాటల్లో చెప్పలేకపోయినా సంజ్ఞల ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కవాతులో అశ్వరాజం రియో..
రియో.. 61వ గుర్రాల రెజిమెంటులో తురుపుముక్క వివిధ వేడుకల్లో ప్రదర్శనలు దానికి కొత్తకాదు. గణతంత్ర ఉత్సవాల్లో కంటింజెంట్ కమాండర్‌ను కూర్చోబెట్టుకుని రాజ్‌పథ్ మార్గంలో ఈ గుర్రం కవాతు చూసి తీరాల్సిందే. తాజా వేడుకల్లో ఈ అశ్వరాజం 18వ సారి తన ప్రదర్శన ఇవ్వనుంది. స్వచ్ఛమైన హనోవేరియన్ జాతికి చెందిన రియోకు 22 ఏళ్లు. ఇది భారత్‌లోనే పుట్టింది. నాలుగేళ్ల వయసు నుంచీ గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొంటోందని కెప్టెన్ దీపాంశు షియొరాన్ తెలిపారు. కమాండర్ సంజ్ఞలను ఇట్టే అర్థం చేస్కోవడం రియో ప్రత్యేకత. 61వ గుర్రాల రెజిమెంట్.. ఇప్పటికే పలు ఘనతలు సాధించింది. 12 అర్జున అవార్డులు గెలుచుకుంది.
ఇదీ చదవండి: పర్యాటకంపై చిగురిస్తున్న ఆశలు