ఉత్తర్‌ప్రదేశ్‌లో పరువు హత్య కలకలం రేపింది. ఓ వ్యక్తిని ప్రేమించిందని యువతిని తన కుటుంబ సభ్యులు, బంధువులు హతమార్చారు. అనంతరం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని కాల్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన హాపుడ్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హఫీజ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపుర్ అనే గ్రామంలో ఓ యువతి నివసిస్తోంది. ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తెలిసిన ఆ యువతి కుటుంబ సభ్యులు ఆమెను వారించారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మూడు రోజులకు గురువారం రాత్రి ఆ యువతిని ఆమె కుటుంబ సభ్యులు దారణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చేశారు. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సరైన విధంగా స్పందించి ఉంటే ఆ యువతి ప్రాణాలు కోల్పోకుండా ఉండేది అని గ్రామస్థులు అసహనం వ్యక్తం చేశారు.
ఈ ఘనకు సంబంధించి బాధితురాలి సోదరుడు అరుణ్, బాబయ్ ధీరు, పెద్దనాన్న కుమారుడు అనుజ్, బాబాయ్ కుమారుడు ఛత్రూపై ఆ గ్రామానికి చెందిన దినేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పరారీలో ఉన్న ఆ నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
రైలు పట్టాలపై వలస కూలీ మృతదేహం.. స్పందించిన బిహార్ సర్కార్..
ఉత్తర భారతదేశానికి చెందిన వలస కార్మికులు తమిళనాడులోని తిరుపూర్ రైల్వే స్టేషన్‌ను ముట్టడించారు. బిహార్‌కు చెందిన ఓ వలస కార్మికుడిని చంపి.. రైలు పట్టాలపై పడేశారని ఆరోపించారు. దీంతో తిరుపుర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఘటనపై నీతీశ్ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. వలసకూలీలపై తమిళనాడులో దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. ఈ ఘటనపై పూర్తి సమాచారం సేకరించేందుకు ఉన్నతాధికారుల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపనున్నట్లు బిహార్ ప్రభుత్వం వెల్లడించింది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సంజీవ్ కుమార్ అనే కార్మికుడు తిరుపుర్ జిల్లాలలోని ఓ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడు. మార్చి 2న అర్ధరాత్రి రైలు పట్టాలపై శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని ఆస్పత్రికి తరలించారు.
అయితే, సంజీవ్‌ను చంపేసి.. రైలు పట్టాలపై పడేశారని ఓ వార్త హచ్‌చల్ చేసింది. దీంతో వస్త్ర, దాని అనుబంధ పరిశ్రమల కార్మికులంతా కలిసి తిరుపుర్ రైల్వే స్టేషన్‌ను ముట్టడించారు. సంజీవ్ కుమార్ ఫోన్, వాహనం కనిపించడం లేదని.. అతడిని కచ్చితంగా హత్య చేసి ఉంటారని వారు ఆరోపించారు. దీనికి స్పందించిన పోలీసులు.. పట్టాలు దాటుతున్న సమయంలో సంజీవ్‌ను అకస్మాత్తుగా రైలు ఢీకొట్టిందని తెలిపారు. ఈ ఘటనపై సరైన దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు. దీంతో అసహనానికి గురైన కార్మికులు.. సంజీవ్ కుమార్ రైల్వే స్టేషన్‌కు వచ్చి వెళ్లినట్లు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
పోలీసులు ఏమంటున్నారంటే..
"సంజీవ్ కుమార్ ట్రాక్ దాటుతున్నప్పుడు చనిపోయాడని.. తిరువనంతపురం-చెన్నై రైలును నడుపుతున్న లోకోపైలట్ వాంగ్మూలం ఇచ్చాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకే మేము ఘటనా స్థలానికి చేరుకున్నాం. అప్పటికే సంజీవ్ చనిపోయాడు. తదుపరి విచారణ కొనసాగుతోంది" అని పోలీసులు వెల్లడించారు.
తమిళనాడులో వలస కూలీలపై దాడులు జరుగుతున్నట్లు గత కొద్ది రోజులుగా పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. హిందీ మాట్లాడినందుకు దాడులు చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన తిరుపుర్ కలెక్టర్ ఉత్తరాది కార్మికులు క్షేమంగా ఉన్నారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వదంతులను నమ్మవద్దని చెప్పారు.