Ludhiana Court Blast: పంజాబ్‌లో లూథియానా జిల్లా కోర్టుల కాంప్లెక్స్‌లో నిందితులు ఐఈడీతో పేలుడుకు పాల్పడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పేలుళ్లు జరిగే అవకాశముందని ముందుగానే మూడుసార్లు పంజాబ్ పోలీసులను హెచ్చరించినట్లు వెల్లడించాయి. సున్నిత ప్రదేశాలు, కీలక భవనాలు, రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా దాడిచేస్తారని ముందే అప్రమత్తం చేసినట్లు..నిఘావర్గాలు తెలిపాయి.
జులై 9, డిసెంబర్ 7న, లూథియానాలో పేలుళ్ల జరిగిన డిసెంబరు 23న కూడా..పంజాబ్ పోలీసులను హెచ్చరించినట్లు.. నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ ఐఎస్‌ఐ, ఖలిస్థాన్ సంస్థల కుట్రపైనా హెచ్చరించినట్లు వెల్లడించాయి.లష్కరే తొయిబా ఉగ్రవాదులు చొరబడే ముప్పుందని ఈనెల 9న పంజాబ్ పోలీసులకు సమాచార మిచ్చినట్లు కేంద్ర నిఘా వర్గాలు వివరించాయి. లూథియానా జిల్లా కోర్టుల సముదాయంలో గురువారం పేలుడు జరిగి ఒకరు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తికి పేలుడుకు పాల్పడిన వారితో సంబంధం ఉన్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు లుథియానా కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లర్. మధ్యాహ్నం 12.22 గంటలకు ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ ఘటనపై ఫారెన్సిక్ నిపుణులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారని పేర్కొన్నారు.
'ఇది కుట్ర'
చన్నీ ప్రభుత్వం చాలా బలహీన ప్రభుత్వం అని పేర్కొన్నారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్‌కు పటిష్ఠమైన ప్రభుత్వం అవసరమని తెలిపారు.
"గురుగ్రంధ్ సాహిబ్‌ను అవమాన పరచిన ఘటన జరిగిన కొద్దిరోజులకే ఈ దుర్ఘటన జరిగింది. ఎన్నికల నేపథ్యంలో శాంతియుతంగా ఉన్న వాతావరణాన్ని హింసాత్మకం చేసేందుకు పలువురు పన్నిన కుట్ర అని నేను భావిస్తున్నాను. వారిని కఠినంగా శిక్షించాలి. ఈ తరహా ఆలోచన ధోరణి ఉన్న వారికి అవకాశం ప్రజలు అవకాశం ఇవ్వకూడదు."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
తాము అధికారంలోకి వస్తే ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు విధిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి : టీకా 'లక్కీ డ్రా'లో ఐఫోన్-12.. కూలీ ఇంట్లో చిరునవ్వు!