high drama in Avinash CBI Enquiry: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో శుక్రవారం రోజంతా.. హైడ్రామా చోటుచేసుకుంది. ఈ కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో తన తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం బాగాలేదంటూ పులివెందుల వెళ్లిపోవడం.. సీబీఐ అధికారులు ఆయనను కొంతదూరం అనుసరించడం.. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ప్రార్థన చేస్తున్న సమయంలో లక్ష్మమ్మకు గుండెపోటు వచ్చిందంటూ ఉదయం 11 గంటల సమయంలో.. కుటుంబీకులు పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో చేర్పించారు.
అదే సమయానికి అవినాష్‌రెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో.. విచారణకు హాజరుకావాల్సి ఉంది. తన తల్లి అనారోగ్యం పాలైనందున.. విచారణకు రాలేనంటూ ఆయన సీబీఐకి న్యాయవాది ద్వారా సమాచారం పంపి.. హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరారు. సీబీఐ అధికారులు ఆయన వాహనశ్రేణిని అనుసరించగా.. అరెస్టు చేసేందుకే వెంబడిస్తున్నారని ప్రచారం జరిగింది. అవినాష్ వాహనశ్రేణికి ఎదురుగా రావాలని పులివెందులలోని వైసీపీ శ్రేణులకు పిలుపు అందగా.. భారీగా తరలివెళ్లారు.
కర్నూలు, అనంతపురం జిల్లాల పరిధిలోని పలు కూడళ్ల వద్ద.. వైసీపీ శ్రేణులు మోహరించాయి. అవినాష్‌ను అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకెళ్తే సీబీఐని అడ్డుకోవాలనే వ్యూహంలో భాగంగానే.. ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులను మోహరించారన్న ప్రచారం జరిగింది. సాయంత్రం 4.45 సమయంలో.. అవినాష్ తల్లిని కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించగా నాటకీయ పరిణామాలకు తెరపడింది. వైద్యులు ఆమెను.. ఐసీయూలో ఉంచి, పరీక్షలు చేశారు. యాంజియోగ్రామ్ చేయాల్సి ఉందని.. మొదట బీపీ సాధారణ స్థితికి రావాల్సి ఉందని పేర్కొన్నారు. తల్లితోపాటు అవినాష్ కూడా ఆసుపత్రిలో చేరారన్న ప్రచారం జరిగినా.. అవి వదంతులేనని తేలింది.
విచారణకు పిలిచిన ప్రతి సారి తప్పించుకుంటున్న అవినాష్!: వివేకా హత్య కేసులో సహ నిందితుడైన అవినాష్‌రెడ్డి.. సీబీఐ దర్యాప్తునకు ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు. విచారణకు పిలిస్తే.. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ నాలుగుసార్లు ఆయన.. ఇలా డుమ్మా కొట్టారు. అరెస్టు కాకుండా వీలైనన్ని ఎక్కువ రోజులు తాత్సారం చేసేందుకే.. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జనవరి 24న హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ.. అవినాష్‌రెడ్డికి సీబీఐ తొలిసారి నోటీసులిచ్చింది. పులివెందుల నియోజకవర్గంలో ముందుగానే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేనని, ఐదు రోజులు గడువు కావాలంటూ.. సీబీఐకి లేఖ రాశారు. 24న విచారణకు గైర్హాజరయ్యారు. మార్చి 6న విచారణకు హాజరుకావాలంటూ.. అదే నెల 5న అవినాష్‌రెడ్డికి.. సీబీఐ నోటీసు జారీ చేసింది. వైసీపీ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో సమావేశం ఉన్నందున రాలేనంటూ.. అవినాష్‌రెడ్డి సీబీఐకి సమాచారం ఇచ్చారు. ఆ రోజూ విచారణకు రాలేదు.
న్యాయపరమైన అడ్డంకులు తొలిగిన తర్వాత రెండు సార్లు పిలిపించగా.. రెండు సార్లు డుమ్మా: ఈ నెల 16న.. విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో గైర్హాజరయ్యారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున.. విచారణకు రాలేనన్నారు. ఆ వెంటనే పులివెందులకు వెళ్లిపోయారు. విచారణకు హాజరయ్యేందుకు.. నాలుగు రోజులు గడువు కోరారు. తాజాగా శుక్రవారం.. సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ, వెళ్లలేదు. సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని అనుమానం వచ్చిన ప్రతిసారీ అవినాష్‌రెడ్డి వివిధ రూపాల్లో దాన్ని అడ్డుకునేందుకే ప్రయత్నించారు. అరెస్టు చేయకుండా.. తెలంగాణ హైకోర్టు రెండు సార్లు ఆదేశాలివ్వగా.. అవి ఆమోదయోగ్యం కాదని, అమల్లో ఉండటానికి వీల్లేదని.. ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అరెస్టుకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో అవినాష్‌ను విచారణ కోసం రెండుసార్లు.. సీబీఐ పిలిపించగా.. రెండుసార్లూ ఆయన గైర్హాజరయ్యారు.
ఇవీ చదవండి: