Heavy Rainfall In Delhi: భారీ వర్షాలు గుజరాత్‌ను అతలాకుతలం చేశాయి. కుండపోతలతో బొటాద్‌లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు నిలిచింది. జునాగఢ్‌లో వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి పెద్ద ఎత్తున వరద చేరడం వల్ల వాహనాలు నీట మునిగాయి. దీంతో మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 3వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. అహ్మదాబాద్‌లో రోడ్లు చెరువులను తలపించాయి. సర్ధార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంలోకి కూడా భారీగా వరద నీరు చేరడం వల్ల రన్ వే సహా కారిడార్ మొత్తం నీట మునిగింది.
దక్షిణ గుజరాత్, సౌరాష్ట్రలలో భారీ, అతి భారీ వర్షాలు కురిశాయి. డ్యామ్‌లు, నదులలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరగా.. ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. దేవ్‌భూమి ద్వారక, రాజ్‌కోట్, భావ్‌నగర్, వల్సద్ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో గుజరాత్‌లో ఆరెంజ్ అలెర్ట్‌ను వాతావరణ విభాగం జారీ చేసింది. అటు.. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి వరద పరిస్థితిపై ఆరా తీశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సహాయక బృందాలను పంపిస్తామని హామీ ఇచ్చారు.
మరింత డేంజర్‌గా యమునా
మరోవైపు దిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాతోనూ అమిత్ షా చర్చలు జరిపారు. యమునా నది ఉదృతి, వరదల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాగా యమునా నది మరోసారి డేంజర్ మార్క్‌ను దాటింది. ఆదివారం రాత్రి 8 గంటల నాటికి మొత్తంగా 206.39 మీటర్లకు యమునా నది చేరుకుందని ఆధికారులు తెలిపారు. దీంతో దిల్లీలోని పలు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. అటు నోయిడాలోనూ పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుకున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమై.. ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పంజాబ్‌లో వెయ్యి కోట్ల నష్టం..
తాజాగా వచ్చిన వరదల కారణంగా పంజాబ్‌లో దాదాపు వెయ్యి కోట్ల నష్టం జరిగిందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. నష్టాలను సంబంధించిన పూర్తి వివరాల నివేదికను కేంద్రానికి పంపి.. సహాయాన్ని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో నష్ట అంచనాలను లెక్కగట్టి.. బాధితులకు పరిహారం చెల్లిస్తామని మాన్ హామీ ఇచ్చారు. భాక్రానంగల్ డ్యామ్‌లో ప్రస్తుత నీటిమట్టం ప్రమాదకర స్థాయి కంటే కిందే ఉందని మాన్ వెల్లడించారు. ప్రస్తుతానికేతే ప్రజల భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డ్యామ్‌లో నీటిమట్టం గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.