Heat Waves In Bihar : బిహార్‌లో గడిచిన మూడు రోజుల్లో వడదెబ్బతో 40 మందికి పైగా మృతి చెందారు. ప్రభుత్వం మాత్రం 10 మరణాలనే అధికారికంగా ధ్రువీకరించింది. శనివారం రాష్ట్రంలోని 35 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పట్నాతో సహా ఐదు జిల్లాల్లో రాత్రి వేళల్లో వేడి గాలులు వీచాయి. మరో రోజు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణం శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రజలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
షేక్‌పుర ప్రాంతంలో అత్యధికంగా 45.1 డిగ్రీలు, పట్నాలో గరిష్ఠంగా 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పట్నా, అర్వాల్, జెహనాబాద్, భోజ్‌పుర్, బక్సర్, షేక్‌పురా, రోహ్‌తాస్, భబువా, ఔరంగాబాద్, నలంద, నవాడలో తీవ్ర వడగాలులు వీచాయి. పట్నా, నవాడ, నలంద, భోజ్‌పూర్, అర్వాల్‌లలో రాత్రి వేళల్లో వేడి గాలులు వీచాయి.
"దాదాపు 11 ఏళ్ల తర్వాత ఇంత వేడి గాలులు వీస్తున్నాయి. 2012లో 19 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి మే 31 నుంచి అలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులు.. రాష్ట్రంలో నమోదైన అధిక ఉష్ణోగ్రతల్లో ఎక్కువ మార్పులు ఉండవు. చాలా జిల్లాలో 42 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతుంది. వేడి గాలుల తీవ్ర దృష్ట్యా.. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించాము. దక్షిణ, పశ్చిమ బిహార్‌లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అభివృద్ధి చేసిన Sachet అనే యాప్‌లో.. తాజా వాతావరణ సమాచారం ఉంటుంది. రానున్న రెండు రోజుల వాతావరణ హెచ్చరికలతో పాటు.. రాబోయే 5 రోజులకు సూచనలు కూడా ఉంటాయి. దేశంలో ఎక్కడి వాతావరణ సమాచారాన్ని అయినా తెలుసుకోవచ్చు. పాప్ అప్ మెసేజ్‌లతో అలర్ట్‌లు వస్తాయి"
--ఆశిశ్ కుమార్, వాతావరణ నిపుణుడు, పట్నా
ఈ వేసవి కాలంలో వడ దెబ్బ, డయేరియా, విరేచనాలు, డీహైడ్రేషన్ కేసులు పెరిగాయని.. ప్రస్తుతం ఇంకా ఎక్కువగా నమోదవుతున్నాయని పట్నాకు చెందిన డాక్టర్ దివాకర్ తేజశ్వి తెలిపారు. 'శరీరంలో తగినన్ని ఎలక్ట్రోలైట్స్ ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగాలి. త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. మసాలాలతో కూడిన ఆహారాన్ని తీసుకోకూడదు. ఎండలో ప్రయాణించేటప్పుడు తరచుగా విరామం తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం కోసం ఎక్కువ నీళ్లు తాగాలి" అని పట్నాకు చెందిన డాక్టర్ దివాకర్ సూచించారు.
వరదలకు అసోం సన్నద్ధం..
మరోవైపు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అసోంలో చాలా నదుల్లో నీటి మట్టం పెరిగింది. దీంతో కొన్ని జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. జిల్లాలన్నీ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సైన్యం, వైమానిక దళం, ఎన్డీఆర్ఎఫ్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.
విపత్తు నిర్వహణ సన్నద్ధతపై అసోం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏఎస్డీఎమ్ఏ) సీఈఓ జ్ఞానేంద్ర దేవ్ మాట్లాడారు. వరద వచ్చే పరిస్థితులు ఉన్నాయని.. కానీ గరిష్ఠ స్థాయిలో ఉండకపోవచ్చని తెలిపారు. ఇది వరదల సీజన్ ప్రారంభం.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.