కాంగ్రెస్ సీనియర్ నేత, దిగ్గజ నాయకుడు అహ్మద్ పటేల్ మృతి పట్ల సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనను గొప్ప ప్రజ్ఞాశాలిగా కీర్తించిన ఆమె.. క్లిష్ట సమయాల్లో సలహాల కోసం ఎన్నోసార్లు ఆయనను సంప్రదించానని గుర్తుచేసుకున్నారు.
"కాంగ్రెస్ పార్టీ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన నా సహచరుడు అహ్మద్ పటేల్‌ని కోల్పోయాను. అహ్మద్‌జీ గొప్ప ప్రజ్ఞాశాలి. విధుల పట్ల ఆయన నిబద్ధత, బాధ్యత, విశ్వసనీయత ఆయన్ను ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. ఇతరులకు సహాయపడటం, దయా హృదయం ఆయనలోని గొప్ప గుణాలు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఓ నమ్మకమైన సహచరుడు, స్నేహితుడు, సోదరుడిగా ఉన్న వ్యక్తిని ఈరోజు నేను కోల్పోయాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి."
- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
రాజీవ్ - రాహుల్ వరకు..
సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అహ్మద్ పటేల్‌కు నెహ్రూ-గాంధీ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. రాజీవ్ హయాం నుంచి రాహుల్ గాంధీ వరకు ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. సోనియా రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి నుంచి ఆమె బృందంలో కీలక వ్యక్తిగా వ్యవహరించారు పటేల్. సుదీర్ఘకాలం ఆమెకు రాజకీయ సలహాదారుగా ఉన్నారు.
అహ్మద్ పటేల్ ఎనిమిది సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. మూడుసార్లు లోక్‌సభ, అయిదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయన.. పార్టీలోని అంతర్గత విభేదాలను పరిష్కరించడంలో దిట్టగా పేరుగాంచారు.
ఇదీ చదవండి: అహ్మద్ పటేల్ మృతిపై ప్రముఖుల విచారం