Hailstorm In Assam : అసోంలోని దిబ్రూగఢ్‌లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో దాదాపు 500 ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ వడగళ్ల వాన వల్ల మోరన్‌లో ఇల్లు కూలి ఓ కార్మికుడు మరణించినట్లు పేర్కొన్నారు. అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపుర్, మిజోరాం, త్రిపురలో మరో రోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని గువహతిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
'తీవ్రమైన వడగళ్ల వాన కారణంగా మోరన్, టింగ్‌ఖాంగ్ రెవెన్యూ సర్కిళ్ల పరిధిలో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. బాధితులకు అన్ని విధాలా ప్రభుత్వం సాయం చేస్తుంది' అని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
'మోరన్, టింగ్‌ఖాంగ్, లాహోవల్, లెకై, నహర్‌కటియా తదితర ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి, మంగళవారం లేకువజామున వడగళ్ల వాన కురిసింది. దీంతో మోరన్‌లో 310 ఇళ్లు, టింగ్ఖాంగ్లో 202 ఇళ్లు, లెకైలో 5 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దిబ్రూగఢ్‌లో ఓ పాఠశాల సైతం ధ్వంసమైంది. '
--అధికారులు
పెద్ద ఎత్తున పడిన వడగళ్లతో ఆ ప్రాంత రోడ్లన్నీ శ్వేత వర్ణంలోకి మారిపోయాయి. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వడగాళ్లు పడుతున్నంత సేపు దిబ్రూగఢ్‌లోని వీధులు నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వడగళ్ల వాన ఆగిపోయిన అనంతరం బయటకొచ్చిన స్థానికులు.. రోడ్డుపై పడి ఉన్న చిన్న చిన్న వడగళ్లను చూసి సంబరపడ్డారు. చిన్నారులు మంచు ముక్కలను ఎగరేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.