Collector Gunman Family Suicide in Siddipet : సరదాగా అలవాటైన బెట్టింగ్, కుటుంబాలనే కబళించేస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే దురాశతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. నిండా మునిగాక, అందులో నుంచి బయటపడే దారి తెలవక చావే శరణ్యం అనుకుంటున్నారు. ఆ కోవలోనే సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లకి చెందిన నరేశ్ జూదానికి(Gambling) ఆకర్షితుడై రత్నాల్లాంటి పిల్లలు, కడదాకా కలిసుండే భార్యను సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపుకున్నాడు. కుటుంబాన్ని బలి తీసుకున్నాక, తానూ ఆ తూటాలకే బలయ్యాడు.
ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం - తన చావుకు సీఎం జగనే కారణమంటూ లేఖ
2013లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికైన నరేశ్ విధుల్లో చురుగ్గా ఉండేవాడు. కొద్దికాలానికే సిద్ధిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద గన్‌మెన్‌గా అధికారులు అతనిని నియమించారు. భార్య చైతన్యతోపాటు, ఆరేళ్ల కుమారుడు రేవంత్, ఐదేళ్ల కుమార్తె హిమశ్రీతో కలిసి రామునిపట్ల గ్రామంలో కుటుంబంతో నివాసముంటున్నాడు. సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో బెట్టింగ్(Betting) చిచ్చురేపింది.
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితుడై, అందినకాడికి అప్పులు చేశాడు. రుణభారం పెరిగిపోవడం ఎలా తీర్చాలో అర్ధంకాక ఊబిలో కూరుకుపోయాడు. తలకుమించిన భారంగా మారిన రూ.80 లక్షల విషయంలో ఇంట్లో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. వాటి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో భూమిని విక్రయించాలని నరేశ్ భావించాడు. చిన్నారుల భవిష్యత్ దృష్ట్యా స్థిరాస్తిని(Immovable Property) అమ్మవద్దంటూ భార్యతోపాటు నరేశ్ తండ్రి వారించారు. ఈ విషయంలోనే ఇంట్లో గొడవలు మరింత ముదిరాయి.
Bodapati Sejal suicide attempt : తెలంగాణ భవన్ ప్రాంగణంలో యువతి ఆత్మహత్యాయత్నం
Collector Gunman Commit Suicide : తన మాట పడనివ్వకుండా అడ్డుకుంటున్నారనే అక్కసుతో నరేష్ ఉన్మాదిలా మారాడు. పాఠశాలకు వెళ్లి చిన్నారులను ఇంటికి తీసుకొచ్చాడు. కంటికిరెప్పలా కాపాడే తండ్రి చేతిలో ఆ చిన్నారులు విగతజీవులుగా మారారు. తన వెంట తెచ్చుకున్న 9 ఎంఎం సర్వీస్ రివాల్వర్‌తో పిల్లలు, కట్టుకున్న భార్యను కాల్చి చంపాడు. అనంతరం తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెట్టింగ్ మాయలో పడిన ఇంటి యజమాని ఇంట్లో ముగ్గురిని తూటాకు బలి తీసుకోవడంపై గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు(Registration of Case) చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సరదాగా మొదలైన అలవాటు ఆ కుటుంబానికి శాపంలా మారి వారిని విగతజీవులుగా మార్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
కుటుంబసభ్యులను కాల్చి, నరేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్‌తో కుటుంబసభ్యులను నరేశ్ కాల్చి చంపాడు. నరేశ్‌కు అప్పులు ఉన్నట్లు ప్రాథమికంగా తెలిసింది. గన్‌మెన్ నరేశ్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నాం. -శ్వేత, సిద్దిపేట సీపీ