Gujarat Election 2022 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అన్నివర్గాల ప్రజలు ఓటుహక్కును వినియోగించేందుకు ఉత్సాహం చూపించారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు కూడా కుటుంబసభ్యులతో వచ్చి ఓటువేశారు. పోలింగ్ ఆరంభమైన తొలిగంటలోనే 5శాతం ఓటింగ్ నమోదుకాగా.. మొత్తం 60.20 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.
వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా చాలావరకు ఉదయాన్నే పోలింగ్‌కేంద్రానికి వెళ్లి ఓటువేశారు. మాజీ సీఎం విజయ్ రూపానీ , క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజ్‌కోట్‌లో ఓటు వేశారు. ఇంకా వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు రాజ్‌కోట్ యువరాజు దంపతులు వింటేజ్‌కారులో వెళ్లి ఓటు వేశారు. భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్.. సూరత్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. వల్సాద్ జిల్లా ఉంబర్‌గావ్ నియోజకవర్గంలో శతాధిక ఓటరు కముబెన్ పటేల్‌ఓటు వేసినట్లు తెలిపింది. 104 ఏళ్ల వృద్ధుడు రాంజీ భాయ్ సైతం పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు.
పెళ్లికి ముందే పోలింగ్‌కు
తాపి జిల్లాలో ప్రపుల్‌భాయ్‌మోరే అనే వరుడు పెళ్లిదుస్తుల్లో వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొన్నాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం జరగాల్సిన తన పెళ్లిని ఓటింగ్‌లో పాల్గొనేందుకుగాను సాయంత్రానికి మార్చుకున్నట్లు తెలిపారు. సూరత్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన హిరేన్ పాండ్య సైతం పెళ్లి బట్టల్లోనే పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. పెళ్లి మండపానికి వెళ్లే ముందు ఓటు వేసి వెళ్లాడు పాండ్య.
సౌరాష్ట్ర-కచ్ రీజియన్, దక్షిణ ప్రాంతంలోని 19జిల్లాల పరిధిలోని 89స్థానాలకు.. ఓటింగ్ పూర్తైంది. 2.39కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారి కోసం 14,382 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 89మోడల్, 89 పర్యావరణహిత పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. గుజరాత్‌లో ఎప్పుడు ద్విముఖ పోటీ ఉండగా.. ఈసారి ఆప్ ప్రవేశంతో త్రిముఖ పోటీ నెలకొంది. ద్వారక జిల్లాలోని ఖంభాలియా నుంచి ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ, ఇటాలియా నుంచి ఆప్ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ తొలిదశ బరిలో ఉన్నారు. మాజీ మంత్రి పురుషోత్తం సోలంకీ, 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కున్వర్జీ బవలియా, కాంతిలాల్ అమృతియా, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా తొలిదశ బరిలో ఉన్నారు.
27ఏళ్లుగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. వరుసగా ఏడోసారి పట్టు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈసారి కూడా అధికారం భాజపా వశమైతే పశ్చిమ బంగాల్‌లో వామపక్ష కూటమి పేరిట ఉన్న రికార్డ్‌ను చేరుకుంటుంది. బంగాల్‌లో వామపక్ష కూటమి వరుసగా ఏడుసార్లు గెలిచి.. 2011వరకు అధికారంలో కొనసాగింది.
ఇవీ చదవండి: తొలిసారి ఓటేసిన ఆఫ్రికా జాతి ప్రజలు.. పోలింగ్ కేంద్రాల వద్ద పశువులకు వైద్యం
'నన్ను తిట్టడంలో కాంగ్రెస్ నేతల పోటీ.. భాజపాకు ఓటేసి బుద్ధి చెప్పండి'