Stray Cattle Bill: బిల్లు ప్రవేశపెట్టాక ఆమోదం పొందేందుకు కొన్ని గంటల పాటు చర్చలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ శాసనసభలో సాయంత్రం ప్రవేశపెట్టిన బిల్లుకు అర్ధరాత్రి ఆమోదం లభించింది. గుజరాత్లో పట్టణ ప్రాంతాల వీధుల్లో గోవులు, మేకలు మొదలైన పశువులు సంచరించడంపై ఆంక్షలు విధిస్తూ ఈ బిల్లును తయారు చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే దీనిని నల్ల చట్టంగా అభివర్ణించాయి ప్రతిపక్షాలు.
ఇదీ జరిగింది: "గుజరాత్ క్యాటిల్ కంట్రోల్ అర్బన్ ఏరియాస్ బిల్" పేరుతో రూపొందించిన ఈ బిల్లులో భాగంగా.. పట్టణ ప్రాంతాల్లో పశువులు సంచరించడాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరాల్లో పశువులను ఉంచాలంటే సంబంధిత యజమానులు అందుకు లైసెన్స్లు పొందాలని బిల్లులో పేర్కొంది. లైసెన్స్ పొందిన 15 రోజుల్లోగా పశువును గుర్తించేందుకు వీలుగా ట్యాగ్ జత చేయాలని స్పష్టం చేసింది. కాని పక్షంలో యజమానికి ఏడాది జైలు శిక్ష లేదా రూ.10వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని తెలిపింది.
ఉల్లంఘనలకు పాల్పడే వారికి కఠిన శిక్ష విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అధికారులు పశువులు స్వాధీనం చేసుకునే సమయంలో వారిపై దాడికి పాల్పడితే ఏడాది జైలు శిక్షతో పాటు రూ.50వేల జరిమానాను విధించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న ట్యాగ్ లేని పశువులను యజమానులు తిరిగి తీసుకోవాలంటే రూ.50వేల జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ బిల్లుపై గురువారం సాయంత్రం 6 గంటలకు మొదలైన చర్చ సుమారు ఏడు గంటల పాటు సాగింది. అర్ధరాత్రి సుమారు 1 గంటకు బిల్లు ఆమోదం పొందింది. "పశువులు వీధుల్లో తిరగడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులను స్వాధీనం చేసుకుని యజమానులకు అప్పగించినా వారు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. వాటిని మళ్లీ వీధుల్లో వదిలేస్తున్నారు. అందుకే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాము" అని మంత్రి వినోద్ మోరాదియా వెల్లడించారు. అహ్మదాబాద్, రాజ్కోట్, వడోదరా సహా 156 ప్రాంతాలు ఈ బిల్లు పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చూడండి: 'పరీక్షలను పండగలా జరుపుకోవాలి'.. విద్యార్థులతో మోదీ