Gufran Encounter Killings By Police : ఉత్తర్‌ప్రదేశ్‌లో మళ్లీ గన్ పేలింది. 13 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ నేరస్థుడు.. ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. ఈ ఘటన కౌశాంబీ జిల్లాలోని మంఝన్పుర్ సమీపంలోని షుగర్ మిల్లు వద్ద మంగళవారం తెల్లవారుజామును 5 గంటల సమయంలో జరిగింది. ఈ మేరకు ఎస్పీ బ్రిజేశ్ కుమార్ శ్రీవాస్తవ వివరాలు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజాద్‌నగర్‌కు చెందిన వ్యక్తి గుఫ్రాన్. ఇతడు కొన్ని ముఠాలతో కలిసి ప్రతాప్‌గఢ్, కౌశాంబీ, ప్రయాగ్‌రాజ్, సుల్తాన్‌పుర్ తదితర జిల్లాల్లో దొంగతనాలు, హత్యలు వంటి నేరాలకు పాల్పడ్డాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతాప్‌గఢ్‌లోని ఓ నగల దుకాణంలోకి ప్రవేశించి తుపాకీతో బెదిరించి దొంగతనం చేశాడు. 2022లో సుల్తాన్‌పుర్‌లోని ఓ పెట్రోల్ పంపులో పట్టపగలే దోపిడీకి పాల్పడ్డాడు. ప్రతాప్‌గఢ్‌లోని రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
దాదాపు 13 కేసుల్లో నిందితుడిగా ఉన్న గుఫ్రాన్‌పై.. ప్రయాగ్‌రాజ్ పోలీసులు రూ.లక్ష, సుల్తాన్‌పుర్ పోలీసులు రూ.25వేల రివార్డు ప్రకటించారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. అయితే, ఓ ముఠాతో మరో నేరానికి నిందితుడు సిద్ధమవుతున్నట్లు లఖ్‌నవూ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)కు సమాచారం అందింది. దీంతో మంఝన్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కడిపుర్ సమీపంలో బైక్‌పై తన సహచరుడితో వెళ్తున్న నిందితుడిని.. మంగళవారం తెల్లవారుజామును 5 గంటల ఎస్టీఎఫ్ చుట్టుముట్టింది.
అనంతరం నిందితుడు పోలీసులపైకి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు.. ఎదురుకాల్పులు జరిపడం వల్ల.. తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏఎస్పీ సమర్ బహదూర్, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి ఓ పిస్తోల్, ఒక బైక్, 17 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Atiq Ahmed Son Death : గత కొన్ని నెలలుగా ఉత్తరప్రదేశ్‌లో వరుస ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో జరిగిన ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ హతమయ్యాడు. ఆ తర్వాత రెండ్రోజులకే అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. ప్రయాగ్‌రాజ్‌లోని వైద్య కళాశాలకు పరీక్షల కోసం తరలిస్తుండగా.. వారిని మీడియా ప్రతినిధులు అనుసరిస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. ఈ సమయంలోనే జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతీక్ ఆహ్మద్, అష్రఫ్ అహ్మద్‌పై అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు.
Atiq Ahmed Death : మొదట అతీక్ అహ్మద్ కణితిపై గురిపెట్టి కాల్చిన నిందితులు.. వారిద్దరూ కింద పడిపోగానే విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అతీక్ అహ్మద్ తలపై ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా ఆయన వెంటనే కిందపడిపోయారు. ఈ కాల్పులు జరుపుతున్న సమయంలో అతీక్ అహ్మద్.. అష్రఫ్ అహ్మద్ చేతులకు సంకెళ్లు వేసి ఉన్నాయి. ఈ కాల్పుల దృశ్యాలు జర్నలిస్టుల మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి.
Uttar Pradesh Encounter List : 2017లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు 10వేలకు పైగా ఎన్‌కౌంటర్లు జరగగా.. 185 మంది క్రిమినల్స్‌ను మట్టుబెట్టారు.