పాఠశాలలను వెంటనే పునఃప్రారంభించాలని (School reopen) పిలుపునిచ్చారు 56 మంది ప్రముఖ వైద్యులు, విద్యావేత్తలు. ఈ మేరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు కలిసి లేఖ రాశారు. తక్షణమే ప్రత్యక్ష బోధన నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
ఈ లేఖను ప్రధానమంత్రి కార్యలయం, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర విద్యామంత్రి ధర్మంద్ర ప్రధాన్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఛైర్‌పర్సన్‌కు పంపించారు. అందులో పాఠశాలలను తిరిగి తెరిచేందుకు పిల్లలకు టీకా వేయడాన్ని (COVID-19 vaccination) ప్రామాణికంగా తీసుకోరాదని సూచించారు.
ఆందోళన అవసరం లేదు..
"విద్యార్థులకు టీకా ఇవ్వకపోవడం, పాఠశాలలు సూపర్స్పెడర్లుగా కనబడటం, థర్డ్ వేవ్ భయాలు, స్కూళ్లు తెరిచిన చోట కేసులు పెరగడం లాంటి ఆందోళనలతో చాలా ప్రభుత్వాలు పాఠశాలలను పునఃప్రారంభించడం లేదు. కానీ, వాటిని తెరవచ్చని ప్రపంచవ్యాప్తంగా అనేక నివేదికలు చెబుతున్నాయి. స్కూళ్లు తెరిచి, అత్యవసరంగా విద్యార్థులకు ప్రత్యక్ష బోధన అందించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి." అని లేఖలో సూచించారు.
తొలుత చిన్నారులకు బడులు..
పిల్లలను తిరిగి బడి బాట పట్టించాల్సిన తక్షణావసరం ఉందని లేఖలో పేర్కొన్నారు విద్యావేత్తలు. చిన్నారులకు వైరస్ ప్రమాదం స్వల్పమే అని, ఐసీఎంఆర్ సిఫార్సుల మేరకు తొలుత ప్రైమరీ పాఠశాలలను తెరవాలని కోరారు.
టీకాల ఉద్దేశం వ్యాధి తీవ్రతను, మరణాలను తగ్గించడమేనని వైద్యులు అన్నారు. చిన్నారులకు తీవ్ర వైరల్ బారినపడే ప్రమాదం తక్కువే కాబట్టి పాఠశాలలను తెరిచేందుకు వ్యాక్సినేషన్ తప్పనిసరి అని భావించరాదని సూచించారు.
దీనిని విద్య ఎక్కువా? ప్రాణాలా? అనే కోణంలో చూడకూడదని అన్నారు విద్యావేత్తలు. విద్యార్థులకు ముఖ్యంగా, బాలికలకు చదువు లేకపోతే వారి తర్వాతి తరం ఆరోగ్యం, జీవనోపాధిపైనా ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
ఇదీ చూడండి: Schools reopen: పాఠశాలకు రాకపోయినా.. ఫుల్ అటెండెన్స్!