Groom Beaten For Asking Dowry : కట్నం అడిగినందుకు వరుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు వధువు బంధువులు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
ఇదీ జరిగింది.. ప్రతాప్‌గఢ్ జిల్లా మాంధాత పోలీస్ స్టేషన్ పరిధిలోని హరఖ్పుర్ గ్రామానికి చెందిన రామ్‌కిషోర్ కుమార్తెకు, జౌన్‌పుర్‌కు చెందిన ఓ యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. బుధవారం రాత్రి జౌన్‌పుర్ నుంచి వరుడు ఊరేగింపుగా హరఖ్పుర్కి చేరుకున్నాడు. అనంతరం వధూవరులిద్దరూ పూల దండలు వేసుకోడానికి అక్కడ ఏర్పాటు చేసిన వేదికపైకి ఎక్కారు. పూలదండలు మార్చుకోకముందే.. వరుడు కట్నం డిమాండ్ చేశాడు.
వరుడి తీరుపై.. వధువు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పెళ్లికొడును ఎంత ఒప్పించినా మాట వినిపించుకోలేదు. కట్నం కోసం పట్టుబట్టాడు. వరుడి తీరుపై ఆగ్రహానికి గురైన వధువు బంధువులు.. వరుడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. వరుడు కట్నం డిమాండ్ చేశాడని వధువు తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మటన్ సరిపోలేదని పెళ్లి రద్దు..
మటన్ సరిపోలేదని వరుడి తరఫు బంధువులు పెళ్లి మండపంలో వీరంగం సృష్టించారు. దీంతో వధువు పెళ్లి రద్దు చేసింది. ఈ ఘటన ఒడిశాలోని సంబల్పుర్ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది.. సంబల్‌పుర్‌కు చెందిన ఓ యువకుడికి.. ఐంతపాలికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వధువు ఇంట్లో ఆదివారం.. పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. దీంతో పెళ్లి కుమారుడు, అతడి కుటుంబ సభ్యులు, బంధువులు వధువు ఇంటికి చేరుకున్నారు. వధువు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన విందును ఆరగించారు.
ఆ సమయంలో చివరి ఏడెనిమిది మందికి మటన్ సరిపోలేదు. దీనికి వరుడి కుటుంబ సభ్యులు.. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులను ప్రశ్నించారు. వారిని అవమానించేటట్లు మాట్లాడారు. రాత్రి సమయంలో మటన్ ఏర్పాటు చేయడం కష్టమని తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు. దీనికి ససేమిరా అన్న వరుడి బంధువులు.. మటన్ పెట్టాల్సిందేనని పట్టుబట్టారు. వరుడి తరఫు వారి ప్రవర్తనకు విసిగిపోయిన వధువు పెళ్లి రద్దు చేసింది. ఈ విషయంపై స్పందించిన పెళ్లికుమార్తె.. అందరికీ మటన్ పెట్టామని, కానీ చివరి కొంత మందికి సరిపోలేదని చెప్పింది. దీంతో వారు తన తండ్రితో వాగ్వావాదానికి దిగారని.. అందుకే పెళ్లి రద్దు చేసుకున్నానని తెలిపింది.
వామ్మో.. మటన్ పెట్టమంటే అలా చేశారా!
పెళ్లి విందులో కోడిమాంసం పెట్టారు. తమకు మటన్ కర్రీ కావాలని పెళ్లికొడుకు బంధువులు డిమాండ్ చేశారు. మటన్ కర్రీ వడ్డించేంత ఆర్థిక స్తోమత తమకు లేదన్నారు వధువు తరఫువారు. అంతే.. ఆగ్రహంతో ఊగిపోయిన వరుడు బంధువులు వాగ్వాదానికి దిగారు. మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.