మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఈ చట్టాలను రద్దుచేయాలని దిల్లీ సరిహద్దుల్లో 50 రోజులకుపైగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో బుధవారం జరిపిన పదో విడత చర్చల్లో కీలక ప్రతిపాదనలు చేసింది. రైతులు, ప్రభుత్వ ప్రతినిధులతో ఉమ్మడిగా కమిటీ వేసి వ్యవసాయ చట్టాల్లో ఉన్న అభ్యంతరాలపై అధ్యయనం చేస్తామని కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్‌గోయల్, సోంప్రకాశ్ ప్రతిపాదించారు. ఈ కమిటీ నివేదిక వచ్చేవరకు సాగు చట్టాల అమలును ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు వాయిదా వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దీనిపై చర్చించుకొని నిర్ణయం చెప్పాలని రైతు సంఘాలను కోరారు. అయితే, చట్టాల అమలు నిలిపివేత ప్రతిపాదనపై కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతిపాదనపై తాము చర్చించుకొని నిర్ణయం చెబుతామన్నారు. అనంతరం ఈ నెల 22న మరోసారి సమావేశమై చర్చలు జరపాలని ఇరువురు నిర్ణయించారు.
"పదో విడత చర్చలు సుహృద్భావ వాతావరణంలో కొనసాగాయి. మూడు వ్యవసాయ చట్టాలను ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు నిలిపివేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సమయంలో పరస్పరం చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ చర్చతో రైతులు తమ ఆందోళనల్ని విరమించి, చర్చలు కొనసాగేలా దోహదపడతాయని భావిస్తున్నాం. ఈ నెల 22న జరగబోయే సమావేశంతో రైతుల ఆందోళన ముగిసిపోతుందని అనుకుంటున్నాం."
- నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
" కనీస మద్దతు ధర, వ్యవసాయ చట్టాలపై కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని మాట ఇచ్చారు. ఈ విషయంపై అన్నీ రైతు సంఘాల నేతలు సమావేశమై నిర్ణయం తీసుకుంటాము. రైతులపై ఎన్‌ఐఏ నమోదు చేసిన నకిలీ కేసులను ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరారు. సానుకూలంగా స్పందించారు. "
-హన్నన్ మొల్లా, అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి
'సుప్రీం' కమిటీకి నో
సుప్రీం కోర్టు నియమించిన నలుగురు సభ్యుల కమిటీ ముందుకు హజరుకాలేమని రైతు సంఘాలు స్పష్టం చేశారు. సభ్యులంతా గతంలో వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా మాట్లాడినవారు కావడం వల్ల రైతుల సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.