Gold Man Of Bihar : బంగారం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎక్కువగా మహిళలు పసిడి అభరణాలు ధరించడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ దీనికి భిన్నంగా బిహార్‌కు చెందిన ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి మాత్రం తన మెడలో 30కి పైగా గొలుసులు, చేతి వేళ్లకు పది ఉంగరాలు ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన ఎక్కడకి వెళ్లినా 5 కేజీల 200 గ్రాముల బరువున్న ఈ అభరణాలు ధరించే వెళ్తారు. మరి బిహార్ గోల్డ్ మ్యాన్ కథ గురించి ఓ సారి తెలుసుకుందామా?
ఆసక్తి..అభిరుచిగా మారి
భోజ్పుర్కు చెందిన ప్రేమ్‌సింగ్‌కు చిన్ననాటి నుంచే బంగారం అంటే ఆసక్తి. ఆయనకు ఉన్న ఈ అభిరుచి క్రమంగా మరింత ఎక్కువై ప్రస్తుతం 5 కేజీల 200 గ్రాముల బంగారాన్ని తన శరీరంపై అలంకరించుకొనేలా చేసింది. ప్రేమ్‌సింగ్ ప్రస్తుతం వాడుతున్న కళ్లద్దాలు, మొబైల్ కవర్ ఇలా చాలా వస్తువులు బంగారంతో చేసినవే కావడం విశేషం. ఈ ఒక్క విషయం చాలు ఆయనను పసిడి అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి.
"నేను ఓ భూస్వామి కుటుంబంలో పుట్టాను. ప్రస్తుతం కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి బంగారం అంటే ఆసక్తి. ప్రస్తుతం కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నా. అందులో వచ్చిన ఆదాయంతో పసిడి అభరణాలు కొనుగోలు చేస్తున్నా. నా వద్ద 2022 వరకూ రెండు కిలోలు బంగారం మాత్రమే ఉండేది. పసిడి ధరించాలనే ఆసక్తి క్రమంగా మరింత పెరిగింది. ప్రస్తుతం నా వద్ద 5 కేజీల 200 గ్రాముల బంగారు అభరణాలు ఉన్నాయి. గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అవతరించాలన్నదే నా లక్ష్యం. నేను వివిధ కార్యక్రమాలకు వెళ్లినపుడు ప్రజలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అప్పుడు ఆనందంగా ఉంది. "
-ప్రేమ్‌సింగ్ , గోల్డ్‌మ్యాన్
భద్రతాపరమైన ఇబ్బందులేం లేవు
5 కేజీల 200 గ్రాముల బంగారు అభరణాలు ధరించి వెళ్లినపుడు తనకు ఎటువంటి భద్రతా పరమైన ఇబ్బందులు ఎదురవ్వలేదని ప్రేమ్ సింగ్ తెలిపారు. బయటకు వెళ్లినపుడు తనతో పాటు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటారని.. వారే తన భద్రతను చూసుకుంటారని చెప్పారు. పసిడి వస్తువులకు సంబంధించి అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని ప్రేమ్ సింగ్ వెల్లడించారు.