మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏడాది పొడవునా పాఠశాలలు మూసే ఉన్నాయని.. ఆన్‌లైన్ తరగతులు నిర్వహించి పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని మధ్యప్రదేశ్‌కు చెందిన కొందరు తల్లిదండ్రులు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. 'మమ్మల్ని ఏం చేయమంటారు సర్.. చావమంటారా?' అని ఆ తల్లిదండ్రులు మంత్రి ఇందర్‌సింగ్ పర్మార్‌ను అడిగారు. దానికి కోపోద్రిక్తుడైన పర్మార్ 'చస్తే చావండి.. కావాలనుకుంటే ఆందోళన చేయండి' అంటూ బదులివ్వడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. తమ బాధలు చెప్పుకునేందుకు మంత్రి వద్దకు వెళ్లిన బృందానికి అధ్యక్షత వహించిన కమల్ విశ్వకర్మ ఈ వ్యవహారంపై మాట్లాడారు.
"రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను లెక్కచేయకుండా పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయాన్ని విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాం. 60 మందితో కూడిన బృందం మంత్రి పర్మార్ ఇంటికి వెళ్లాం. దాదాపు గంటన్నర వేచిచూడగా.. మంత్రి కార్యాలయానికి చెందిన ఓ అధికారి మా వద్దకు వచ్చారు. ఓ నివేదికను సమర్పించి మంత్రిని కలవాలని ఆ అధికారికి తెలియజేశాం. కొద్దిసేపటికే మంత్రి ఇంట్లో నుంచి బయటకువచ్చారు. 60 మంది ఆయన కోసం ఎదురుచూస్తున్నా.. మమ్మల్ని పట్టించుకోకుండా ఆయన నేరుగా తన కారు వద్దకు వెళ్లారు. పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని.. సమస్యను పరిష్కరించాలని మేము ఆయన వద్దకు వెళ్లి వేడుకున్నాం. ఇందుకు వెంటనే వెటకారంగా 'మేము సమస్యలు సృష్టిస్తాం' అని సమాధానమిచ్చారు."
-కమల్ విశ్వకర్మ.
మంత్రి పర్మార్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మంత్రి రాజీనామా చేయాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలూజ డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను డిమాండ్ చేశారు. 'ఏం చేసుకుంటారో చేసుకోండి.. చస్తే చావండి అని మంత్రి మాట్లాడటం మధ్యప్రదేశ్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం' అని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జితూ పట్వారీ ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: రాహుల్‌తో నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ భేటీ
ఇదీ చూడండి: కరోనాపై కేంద్ర మంత్రులకు మోదీ కీలక ఆదేశాలు