కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐకి కాగ్, ఈసీ మాదిరిగా స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరముందని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. కేవలం పార్లమెంటుకు మాత్రమే నివేదికలు అందించే వెసులుబాటు ఈ సంస్థకు కల్పించాలంది.
తమిళనాడులో జరిగిన రూ.300 కోట్ల పోంజీ కుంభకోణంపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది మద్రాసు హైకోర్టు. సీబీఐకి స్వయంప్రతిపత్తి కల్పించేలా చట్టాన్ని తీసుకువచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని జస్టిస్ ఎన్ కిరుబకరణ్, జస్టిస్ బీ పుగలెంధిలతో కూడిన మధురై బెంచ్ పేర్కొంది. ఈసీ, కాగ్ మాదిరిగా సీబీఐ స్వతంత్రంగా పనిచేయాలని వ్యాఖ్యానించింది.
"ఏదైనా కేసును సీబీఐ విచారించాలని డిమాండ్ వచ్చినప్పుడల్లా.. తమ వద్ద సరిపడా వనరులు, సిబ్బంది లేరని అధికారులు తరచూ కోర్టులకు చెప్పడం బాధాకరం. సీబీఐ డైరెక్టర్ నేరుగా కేంద్రమంత్రి, ప్రధానికి రిపోర్టు ఇచ్చేలా కేబినెట్ కార్యదర్శి తరహాలో ప్రత్యేక అధికారాలు కలిగి ఉండాలి. సీబీఐకి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ఈ సంస్థకు కావాల్సిన కనీస సదుపాయాలు, భవనాలు, నివాసాలు, సాంకేతిక అవసరాలు ఆరు వారాల్లో తీర్చాలి" అని న్యాయస్థానం పేర్కొంది.
ఇదీ చూడండి: తొలి మహిళా సీజేఐగా ఆ న్యాయమూర్తికే అవకాశం?