మహారాష్ట్ర జల్గావ్లో కొందరు పోలీసులు హాస్టల్ విద్యార్థినులను బలవంతం చేసి నగ్నంగా నృత్యాలు చేయించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆదేశించారు. ఇందుకోసం నలుగురు సభ్యుల ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో హోంమంత్రి శాసనసభలో ఈమేరకు ప్రకటన చేశారు.
"ఇది చాలా బాధాకరమైన ఘటన. దీనిపై దర్యాప్తునకు ఆదేశించాం. నలుగురు సభ్యుల ఉన్నత స్థాయి బృందాన్ని రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని కోరాం. వారు సమర్పించిన నివేదికను బట్టి తదుపరి చర్యలు చేపడతాం."
-అనిల్ దేశ్ముఖ్, మహారాష్ట్ర హోంమంత్రి.
ఈ ఘటనపై ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తోందని తొలుత భాజపా నేత సుధీర్ ముంగంతివార్ మండిపడ్డారు. దీనికి సంబంధించి పోలీసుల దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని అన్నారు. అయినా... త్వరితగతిన చర్య చేపట్టేందుకు సిద్ధంగా లేరని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు లభ్యమైనట్లు భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ కూడా ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి:సీడీ కేసులో కర్ణాటక మంత్రి రాజీనామా